
గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేసిందే కాంగ్రెస్
● గౌరవెల్లిని 95శాతం పూర్తి చేశాం ● నిర్వాసితులను మోసం చేసిన పొన్నం ● మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ ధ్వజం
హుస్నాబాద్: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే గౌరవెల్లి ప్రాజెక్టు 95 శాతం పూర్తి చేశామని, ప్రాజెక్టును అడ్డుకోవడానికి గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేసిందే కాంగ్రెస్ నాయకులని మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార అన్నారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. నలుగురు మంత్రుల పర్యటనలో అవాకులు, చెవాకులు, ఉపన్యాసాలే తప్పఈ ప్రాంతానికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు. తాము మంజూరు చేసిన పనులకు శంకుస్ధాపనలు చేయడం గొప్పనా అని ప్రశ్నించారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు ఎకరాకు రూ.30 లక్షలు ఇప్పిస్తానని హామీ ఇచ్చిన పొన్నం ప్రభాకర్.. మంత్రి అయిన తర్వాత రూ.17 లక్షలు ఇచ్చి నిర్వాసితులను నిండా మోసం చేశారని మండిపడ్డారు. మెడికల్ కళాశాల ఏర్పాటు చేయకుండా పీజీ మెడికల్ కళాశాల ఏలా సాధ్యమని ప్రశ్నించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, బాలికల జూనియర్ కళాశాల, మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్ర భవనం, సమీకృత కార్యాలయాల భవనం, పాలిటెక్నిక్ కళాశాల, ఏసీపీ కార్యాలయం తమ హయాంలో పూర్తి చేశామన్నారు. ఇంజనీరింగ్ కళాశాల తరగతుల నిర్వాహణకు తాము కట్టించిన పాలిటెక్నిక్ కళాశాల గతైందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆస్పత్రి అంబులెన్స్ కోసం మంత్రి అనుచరుడు చందాలు వసూలు చేసిన డబ్బులు ఎక్కడున్నాయ ని ప్రశ్నించారు. ఈ సమావేశంలో హన్మకొండ మాజీ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.