అప్పుడే మేల్కొనుంటే.. | - | Sakshi
Sakshi News home page

అప్పుడే మేల్కొనుంటే..

Jul 1 2025 5:20 PM | Updated on Jul 1 2025 5:20 PM

అప్పుడే మేల్కొనుంటే..

అప్పుడే మేల్కొనుంటే..

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: గతేడాది మార్చిలో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్‌లో ఎస్‌బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలి ఆరుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు సైతం శిథిలమయ్యాయి. ఈ ఘటనలో అమాయక కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోగా 30 మంది క్షతగాత్రులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ భారీ ఘటనతోనైనా సంబంధిత అధికారులు మేల్కొని ఉంటే..ఇప్పుడు ఇలా సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు ఘటన పునరావృతం అయ్యేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్‌బీ ఆర్గానిక్స్‌ ప్రమాదం జరిగినప్పుడు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించాలి..ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టాలనే దానిపై కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఈ కనీసం నిబంధనలు పాటించకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి.

కీలకపని ప్రదేశాల్లో స్కిల్డ్‌ లేబర్‌ లేక..

పరిశ్రమల్లో కీలక పని ప్రదేశాల్లో స్కిల్డ్‌ లేబర్‌తో పనిచేయించాలి. ముఖ్యంగా రియాక్టర్లు, బాయిలర్లు, బ్లోయర్లు, ఇలా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సంబంధిత అంశాల్లో అన్ని అర్హతలున్నవారికి విధులను అప్పగించాలి. కానీ, తక్కువ వేతనాలకు పనిచేస్తారనే కారణంగా ఇలాంటి కీలక ప్రదేశాల్లో అన్‌స్కిల్డ్‌ కార్మికులతో పనులు చేయించడంతో ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న పరిశ్రమల యాజమాన్యాలు ఇలా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు ఏవీ..

పరిశ్రమల్లో కనీస భద్రతా ప్రమాణాలను పాటించేలా ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. కానీ, ఈ తనిఖీలు జిల్లాలో మొక్కుబడిగా జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ఆయా పరిశ్రమల నుంచి ప్రతినెలా ఠంఛనుగా మామూళ్లు పొందుతున్న ఈ శాఖ అధికారులు పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పాటించకపోయినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎస్‌బీ ఆర్గానిక్‌ పరిశ్రమ ప్రమాదానికి కొద్దిరోజుల ముందే ఇదే హత్నూర మండలంలో కోవాలెంట్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఇలా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ.. సంబంధిత అధికారుల్లో కనీసం చలనం లేకుండా పోయింది.

ప్రమాదం జరిగాక హడావుడి

సంబంధిత అధికారులు ఇలా ప్రమాదం జరిగాక హడావుడి చేస్తున్నారే తప్ప ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు శూన్యమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఎస్‌బీఆర్గానిక్స్‌ భారీ పేలుడు ఘటన జరిగిన కొన్ని రోజులకే ఇప్పుడు సిగాచీ పరిశ్రమలో అంతకుమించి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రభుత్వం ఇకనైనా స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా నిబంధనలను అమలు చేయాలని డిమాండ్‌ వ్యక్తమవుతోంది.

నాడు ఎస్‌బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో

రియాక్టర్‌ పేలి ఆరుగురు మృతి..

ఇదే తరహాలో ఇప్పుడు

సిగాచీ పరిశ్రమలో ఘటన..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement