పాశమైలారంలో భారీ పేలుడు ● మరుభూమిగా ఘటనా స్థలం | - | Sakshi
Sakshi News home page

పాశమైలారంలో భారీ పేలుడు ● మరుభూమిగా ఘటనా స్థలం

Jul 1 2025 5:20 PM | Updated on Jul 1 2025 5:20 PM

పాశమై

పాశమైలారంలో భారీ పేలుడు ● మరుభూమిగా ఘటనా స్థలం

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధి కోసం వస్తే ఏకంగా ఉసురే తీసేసింది సిగాచీ పరిశ్రమ. సోమవారం ఈ కంపెనీలో జరిగిన విస్ఫోటనం బతుకుదెరువుకోసం వలస వచ్చిన వారి జీవితాలను బుగ్గిపాలు చేసింది. పేలుడు ధాటికి దూరంగా ఎగిరిపడ్డ కార్మికుల మృతదేహాలతో..చిధ్రమైన శరీరభాగాలతో, కూలిన శిథిలాలతో సిగాచీ మరుభూమిని తలపించింది. తమ వారి ఆచూకీ కోసం బాధితుల ఆక్రందనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భీతిల్లింది. ఈ పారిశ్రామికవాడలో కార్మికుల కుటుంబాలు కోల్పోతున్నా పరిశ్రమ యాజమాన్యానికి మాత్రం సాధారణమేనని తరచూ జరిగే ప్రమాదాలు నిరూపిస్తూనే ఉన్నాయి. అనుభవాలు, ప్రమాద పాఠాల నుంచి యాజమాన్యాలు, ప్రభుత్వాలు గుణపాఠం నేర్వవని మరోసారి ఈ ప్రమాదంతో రుజువైంది. సోమవారం ఉదయం జరిగిన రియాక్టర్‌ పేలుడు ఘటన ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది.

పారిశ్రామిక వాడలో విషాదం

దయమే తమ ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్లిన కొద్ది సేపటికే ప్రమాదం జరిగినట్లు సమాచారం తెలుసుకున్న బాధిత కార్మికుల కుటుంబసభ్యుల ఆవేదన అంతా ఇంతా కాదు. కుటుంబసభ్యుల ఆచూకీ లభించకపోవడంతో కార్మికుల కుటుంబసభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి. తమ వారు ఏమయ్యారో తెలియకపోవడంతో వారు అధికారుల చుట్టూ తిరిగారు. అక్కడి నుంచి స్పందన లేకపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. దీంతో పాశమైలారం పారిశ్రామికవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. కాలినగాయాలతో బాధపడుతున్న తమ ఆత్మీయులను చూసి బోరున విలపించారు. కళ్లముందే విగత జీవులుగా మారిన తమ వారిని చూసి కన్నీరు మున్నీరుగా రోదించారు. తమ వారి జాడ ఎక్కడైనా లభిస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు.

వారంతా రోజు మాదిరిగానే విధుల్లోకి వచ్చారు. తమ తోటి కార్మికులు, ఉద్యోగులకు శుభోదయం చెప్పుకున్నారు. అప్పుడప్పుడే ఎవరికివారు తాము పని చేసే స్థలాల్లో నిమగ్నమవుతున్నారు. ఒక్కసారిగా మృత్యువు పేలుడు రూపంలో కబళించింది. ఉన్నపళంగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. పొగ పూర్తిగా కమ్ముకోవడంతో చుట్టూ చీకటి. అగ్నికీలలకు దేహాలు ఆహుతైపోయాయి. శరీరభాగాలకు మంటలు అంటుకున్నాయి. మరికొందరి శరీరాలు మాడి మసైపోయాయి. ఎటు చూసినా హాహాకారాలు. ప్రమాదం నుంచి బయటపడేందుకు ఆర్తనాదాలు.. సిగాచీ పరిశ్రమల్లో రియాక్టర్‌ పేలిన ఘటనకు సంబంధించి భీతావహ వాతావరణం ఇది. ఎక్కడపడితే అక్కడ కార్మికుల శవాలు. కాలి బూడిదై.. మసైపోయిన శరీర భాగాలు. ఇలా పేలుడు జరిగిన ప్రదేశం పూర్తిగా మరుభూమిని తలపించింది.

సిగాచీ పరిశ్రమ ఎదుట భీతావహం తమ వారి ఆచూకీ కోసం విలపించిన బాధిత కుటుంబ సభ్యులు

ఉపాధి కోసం వచ్చి అనంత లోకాలకు..

వారంతా పొట్ట చేతబట్టుకుని వచ్చిన నిరుపేద కుటుంబాలే. ఉపాధి కోసం వందల కిలోమీటర్లు నుంచి వచ్చిన కార్మికులే అధికం. బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి భార్యాబిడ్డలతో వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. చాలీ చాలని జీతాలున్నప్పటికీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ కార్మికుల కుటుంబాల్లో ఈ పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పొట్ట చేతబట్టుకుని వచ్చిన తమ వారిని మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉపాధి కోసం వస్తే ఉసురే పోయిందని విలపిస్తున్నారు. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా తమ వారి ఆచూకీ లభించకపోవడంతో వారు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.

పాశమైలారంలో భారీ పేలుడు ● మరుభూమిగా ఘటనా స్థలం1
1/2

పాశమైలారంలో భారీ పేలుడు ● మరుభూమిగా ఘటనా స్థలం

పాశమైలారంలో భారీ పేలుడు ● మరుభూమిగా ఘటనా స్థలం2
2/2

పాశమైలారంలో భారీ పేలుడు ● మరుభూమిగా ఘటనా స్థలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement