
ఉద్యమకారుల శాంతియుత దీక్ష
చేర్యాల(సిద్దిపేట): తెలంగాణ ఉద్యమకారులు శాంతియుత దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద దీక్షకు దిగారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యమకారులు మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పటి వరకు హామీలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యమకారుల గుర్తించి, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.10లక్షలు, ప్రతి నెల రూ.25వేల పెన్షన్, ఉచిత వైద్యం, బస్‌పాస్, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. దీక్షలను పరిరక్షణ కమిటీ కన్వీనర్ పందిళ్ళ నర్సయ్య నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. దీక్షలో ఉద్యమకారులు అంబటి నర్సయ్య, ఆడెపు వెంకయ్య, అంబటి అంజయ్య, అందె అశోక్, బండోజు భాస్కర్, ఎండీ.జహురద్దీన్, సంజీవరెడ్డి, మంగోలు చంటి, మంచాల కొండయ్య పాల్గొనగా వివిధ పార్టీలు, సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
హామీలు నెరవేర్చాలని డిమాండ్