
అర్జీలు పునరావృతం కావద్దు
● తక్షణం పరిష్కరించండి ● అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
సిద్దిపేటరూరల్: ప్రజలు ఇచ్చే అర్జీలు తిరిగి పునరావృతం కాకుండా తక్షణం పరిష్కరించాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాధితులు అందించిన అర్జీలను పరిశీలించి సత్వర న్యాయం చేయాలన్నారు. రెవెన్యూ, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ 73 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, డీఆర్‌డీఓ జయదేవ్‌ఆర్యా అధికారులు పాల్గొన్నారు.
మా భూమిని మాకు ఇప్పించండి..
మా భూమిని మాకు ఇప్పించాలని సిద్దిపేట పట్టణానికి చెందిన ఎన్. పద్మ కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో అర్జీ సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆర్‌సేటి కోచింగ్‌సెంటర్ కోసం గతంలో తమ పేరు మీద ఉన్న 242 గజాల భూమిని 2021లో తీసుకున్నారన్నారు. దానికి బదులుగా టెలికాంనగర్‌లో 200 గజాల భూమి ఇస్తానని చెప్పి సర్టిఫికెట్ అందించి, హద్దులు చూపించారన్నారు. కానీ అప్పటికే అక్కడ పొజిషన్‌లో ఉన్న వ్యక్తి అడ్డుకుంటున్నారన్నారు. కలెక్టర్ స్పందించి తమ భూమిని తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు.
u