
ఉపాధిలో అక్రమాలకు చెక్
ఐదుగురు సభ్యులతో
వీఎంసీ కమిటీల ఏర్పాటు
● ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
● అవకతవకలు జరిగిన వెంటనే చర్యలు
● సామాజిక తనిఖీ సభల్లో గుర్తించి రికవరీ
సిద్దిపేటరూరల్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పూర్తి స్థాయిలో పారదర్శకంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. పనులు, కూలీల చెల్లింపులు, కొలతల వంటి పనులపై ప్రత్యేకంగా నిఘా పెట్టేందుకు గ్రామాల్లో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. పనుల పర్యవేక్షణ తోపాటు అవకతవకలు జరిగిన వెంటనే చర్యలు చేపట్టేందుకు ఈ కమిటీ (వీఎంసీ)కి పూర్తిస్థాయిలో అధికారాలు కట్టబెట్టింది. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి అవకతవకలకు పాల్పడిన వారిపై చర్య లు తీసుకునేలా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.
సభ్యుల నియామకానికి నిబంధనలు
జిల్లాలోని 490 గ్రామపంచాయతీల్లో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలను ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేయాలని ప్రతీ గ్రామపంచాయతీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీల్లో అంగన్వాడీ టీచర్, యూత్ సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామైక్య సంఘం సభ్యురాలు, ఈజీఎస్ సభ్యులు ఉంటారు. పంచాయతీల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు కమిటీలను ప్రతిపాదిస్తూ ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు నివేదికలు పంపించారు. ఈ కమిటీలు దాదాపు ఆరు నెలల పాటు పనిచేయనున్నట్లు ప్రతిపాదనలు అందాయి.
కమిటీ విధులు..
విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ప్రతీ వారంలో ఒక్క సారైన ఉపాధిహామీ పనులను పర్యవేక్షించే బాధ్య త ఉంటుంది. పనుల కల్పన, కూలీల చెల్లింపు, సౌకర్యాలు వంటి అంశాలను క్షేత్రస్థాయిలో కూలీలతో చర్చించాల్సి ఉంటుంది. పనుల్లో నాణ్యత, వ్యయాన్ని అంచనా వేయడం, చేపట్టిన పనులపై నివేదికలు అందజేయడం కమిటీల బాధ్యత. ప్రతి ఏటా జరిగే సామాజిక తనిఖీ సభల్లో అవినీతిని గుర్తించి వాటిని రికవరీ చేయడంలో కీలకంగా కమిటీలు వ్యవహరిస్తాయి. అవకతవకలు జరిగిన వెంటనే కమిటీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది.
జిల్లాలో జాబ్‌కార్డులు, కూలీల వివరాలు
మొత్తం కార్డులు 1 లక్షా 97 వేలు
యాక్టివ్ జాబ్‌కార్డులు 1లక్షా 24 వేలు
మొత్తం కూలీలు 3 లక్షల 95 వేలు
యాక్టివ్ కూలీలు 2 లక్షల 8 వేలు
వీఎంసీ కమిటీలు 490
వీఎంసీ కమిటీలోని సభ్యులు 2,493
గరిష్ట వేతనం 307
సగటు వేతనం 251.99
నేటికి 18లక్షల 61వేల పనిదినాలు
రోజువారి కూలీలు 40వేలు
నేటికి చెల్లించిన వేతనం: 49 కోట్ల 24లక్షలు
జవాబుదారీగా ఉంటుంది
జిల్లాలోని 490 గ్రామ పంచాయతీల్లో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేశాం. ఉపాధిహామీ పథకం పనుల్లో అవకతవకలకు తావు లేకుండా పర్యవేక్షించేందుకు ఈ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతలను కమిటీ సభ్యులకు అప్పగించాం. పనులు పారదర్శకంగా నిర్వహించడంతో పాటు జవాబుదారీగా ఉండేందుకు ఈ కమిటీలు దోహదపడనున్నాయి.
– జయదేవ్‌ఆర్య,
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి

ఉపాధిలో అక్రమాలకు చెక్