
‘సాగు’దామా.. వద్దా!
రోళ్లు పగిలే కార్తెలో వర్షాలు
● ముందస్తుగానే రుతుపవనాలు ● ఇప్పటికే 106మి.మీ. వర్షపాతం నమోదు ● విత్తనాలు విత్తడంపై రైతుల మీమాంస ● తొందర పడొద్దని వ్యవసాయఅధికారుల సూచన
నారాయణఖేడ్: ‘రోహిణి కార్తెలో ఎండ వేడిమితో రోళ్లు పగులుతాయి’అనేది నానుడి. వేసవి కాలం చివరి అంకంలో విపరీతమైన ఉక్కపోత, వేడిమితో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఈ సమయంలో రైతులు వేసవి దుక్కులను జోరుగా చేపడుతారు. దుక్కులు సిద్ధం చేసుకున్నాక.. మృగశిర కార్తె (మిర్గం) వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తారు. కానీ ఈసారి పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ‘తొందరపడి కోయిలా ముందే కూసింది’అన్న చందంగా ముందస్తుగానే భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా అంతటా ఇప్పటికే వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో రైతులు, అధికార వర్గాల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వర్షాలకు కొందరు రైతులు పత్తి విత్తనాలు విత్తే పనులు చేపడుతుండగా.. ముందస్తుగా విత్తనాలు వేస్తే వేసవి ఎండలు కాచిన పక్షంలో విత్తనాలు చనిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. భూమి పూర్తిగా తడిసిన తర్వాతనే విత్తనాలు విత్తాలని చెబుతున్నారు.
106మి.మీ వర్షపాతం నమోదు
ఈ వేసవిలో అకాల వర్షాలు బాగానే కురిశాయి. అవీ 19.1 మి.మీ మేరనే కురుస్తాయని అధికారులు ముందుగా అంచనా వేశారు. కానీ సంగారెడ్డి జిల్లాలో 106 మి.మీ వర్షపాతం ఇప్పటికే నమోదైంది. వాస్తవానికి వర్షాకాలం జూన్‌లో ప్రారంభం కాగా జూలైలోసాధారణ వర్షపాతం 120మి.మీ కురియాలి. అంటే వేసవిలోనే దాదాపు అదే స్థాయిలో వర్షపాతం నమోదైందన్న మాట. 14 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా కొండాపూర్, చౌటకూర్ మండలాల్లో అతిభారీ వర్షాలు నమోదయ్యాయి.
రోళ్లు పగిలే కార్తె..
రోహిణి కార్తె మే 25న ప్రారంభమై జూన్ 7 వరకు విపరీతమైన ఎండలుంటాయి. అయితే.. ఈసారి ఇప్పటికే వర్షాలు కురిసి వాతావరణం పూర్తిగా చల్లబడింది. వేసవిలో రైతులు వేసవి దుక్కులు దున్నడం వల్ల భూమిలోపల ఉండే క్రిమి, కీటకాలు, వాటి గుడ్లు బయటికి వచ్చి నశించే అవకాశం ఉంది. దున్నడంతో భూమి సైతం పొరలుగా ఏర్పడి గాలి (ఆక్సిజన్) మార్పు జరుగుతుంది. తద్వారా మృగశిరలో కురిసిన వర్షాలకు భూమి బాగా తడిసి వేసిన విత్తనాలు బాగా మొలకెత్తి విత్తనం వేర్లు దెబ్బతినకుండా భూమి లోపలికి వెళ్లే ఆస్కారం ఉంటుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో..
ఈసారి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశిస్తున్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడుతున్న అల్పపీడన ద్రోణి వల్ల ఈ వర్షాలు కురుస్తున్నట్లు అంచనా. దీనికి తోడు రావాల్సిన నైరుతి ముందే కూసింది. సహజంగా జూన్ మొదటి వారంలో వచ్చే నైరుతి ఈసారి మే మధ్యస్తంలోనే పలకరించింది. జూన్ 24నాటికే కేరళను రుతుపవనాలు తాకాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇలాంటి అకాల వర్షాల కారణంగా భూసారంలో తేడా వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గమనిస్తే సాధారణం కంటే ముందుగా వర్షాకాలం ప్రారంభమైంది. సరైన సమయంలో వర్షాలు కురవకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వానాకాలం సాగు చేసేవారు వాతావరణ మార్పులు ఎలా ఉన్నా వారి జాగ్రత్తల్లో వారు ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని బాగాలకు రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.