
ముదిరాజ్‌లను గ్రూప్ ఏలో చేర్చాల్సిందే
● లేదంటే మహనీయుల సాక్షిగా పోరాటం ● మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్
నంగునూరు(సిద్దిపేట): ముదిరాజ్ కులాన్ని బీసీ డి నుంచి గ్రూప్ ఏలోకి మార్చాలని, లేదంటే పోరాటం చేస్తామని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా పేద ముదిరాజ్ కులస్తులకు సంక్షే పథకాలు అందడంలేదన్నారు. మండల పరిధి పాలమాకులలో ఏర్పాటు చేసిన పండుగ సాయన్న, కొరివి కృష్ణస్వామి విగ్రహాలను సోమవారం ఎమ్మెల్యే హరీశ్‌రావుతో కలసి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ చేయించిన సమగ్ర కుటుంబ సర్వేలో ముదిరాజ్ కులస్తులు అధిక సంఖ్యలో ఉన్నట్లు తేలిందన్నారు. వారికి ఉపాధి కల్పించేందుకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడంతో పాటు మోటార్ సైకిళ్లు, ఆటోలు, బండ్లు, పడవలు, వలల కోసం ఆర్థిక సహాయం కేసీఆర్ అందజేశారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నేటికీ అమలు చేయడంలేదన్నారు. మొదటి మేయర్‌గా ఎన్నికై న కృష్ణస్వామి సంక్షేమ పథకాల కోసం కృషి చేస్తే, పండుగ సాయన్న భూమి కోసం పోరాటం చేశాడని తెలిపారు.
చేప పిల్లలను వదలాలి
ముదిరాజ్ సోదరులకు ఉపాధి కల్పిస్తున్న చేప పిల్లల పెంపకానికి ప్రభుత్వం నిధులు కేటాయించి టెండర్లు పిలవాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. విగ్రహాలను ఏర్పాటు చేయడం ఎంత ముఖ్యమో వారిని ఆదర్శంగా తీసుకొని ఆశయాలను అమలు చేయాలన్నారు. కృష్ణస్వామి, సాయన్న జాతి కోసం, కానిస్టేబుల్ కిష్టయ్య తెలంగాణ కోసం అమరుడై చరిత్రలో నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.