
మనమెంతభద్రం!
గుల్జార్‌హౌస్ అగ్ని ప్రమాద ఘటనతో అప్రమత్తత అవసరం జిల్లాలో ఆస్పత్రులు, వ్యాపార సంస్థల నిర్వహణ అస్తవ్యస్తం పట్టించుకోని మున్సిపాలిటీలు, అగ్నిమాపక అధికారులు
సాక్షి, సిద్దిపేట: హైదరాబాద్‌లోని చార్మినార్ గుల్జార్ హౌస్‌లో అగ్నిప్రమాదం ఘటన జిల్లాకు హెచ్చరికలాంటిది. ఈ ఘటనలో 17 మంది చనిపోయిన విషయం విదితమే. జిల్లా విషయానికి వస్తే.. ఏప్రిల్ 2న కొండపాక మండలం మార్పడగ గ్రామంలో ఓ కుటుంబం తాళం వేసి ఊరికి వెళ్లింది. అర్ధరాత్రి వేళ ఇంట్లో నుంచి పొగలు వస్తుండటంతో చుట్టు పక్కల వారు గమనించి ఫైర్ స్టేషన్‌కు సమచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.15లక్షల నష్టం వాటిల్లింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం అని అధికారులు తెలిపారు.
తక్షణం మేల్కోవాలి..
ఈ ఘటనలు చూసైనా జిల్లా వాసులు, మున్సిపాలిటీలు, వ్యాపార సంస్థలు, ఆస్పత్రుల యజమానులు మేల్కోవాల్సిన అవసరం ఉంది. జిల్లా కేంద్రంలో ఇరుకిరుకు భవనాల్లో ప్రైవేట్ ఆస్పత్రులు, వ్యాపార సంస్థలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణం చర్యలు చేపట్టే అవకాశం లేకుండా ఉంది. అడిగేవారు లేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల, వ్యాపార సంస్థల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. పట్టణాల్లో విద్యుత్ స్తంభాల పై విద్యుత్ వైర్లు గజిబిజిగా ఉంటున్నాయి. ఇటు మున్సిపాలిటీలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి.
అప్రమత్తం చేస్తున్నాం
జల్లాలోని ఆస్పత్రులు, అపార్ట్‌మెంట్, షాపింగ్ మాల్‌లలో అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నాం. ప్రతి రెండు నుంచి మూడు నెలలకు ఒక సారి అవగాహన కల్పిస్తున్నాం. పైర్ నింబంధనలు పాటించాలి.
– గుండయ్య, స్టేషన్ ఫైర్ అధికారి, సిద్దిపేట