
మళ్లీ దంచికొట్టిన వాన
దుబ్బాకలో వర్ష బీభత్సం
● కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ● కూలిన ఇళ్లు, గుడిసెలు ● నేల వాలిన భారీ వృక్షాలు
దుబ్బాక/దుబ్బాకటౌన్: ఉరుములు.. మెరుపులు.. గాలివానతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి కురిసిన వర్షం రైతులను మళ్లీ వణికించింది. సుమారు 2 గంటలకుపైగా వాన దంచికొట్టడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం రాశులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు నానాయాతన పడ్డారు. దుబ్బాక మార్కెట్ యార్డులో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వరుసగా 3 రోజులుగా వాన కురవడంతో రైతన్నను కునుకులేకుండా చేసింది. ధాన్యం అంతా చేతికిరాకుండా పోవడంతో కన్నీటిపర్యంతమయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మళ్లీ వాన పడితే మొలకలు వచ్చే పరిస్థితి ఉందన్నారు. అధికారులు వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.
తల్లడిల్లిన పిట్టల వాడ
రాత్రి ఒక్కసారిగా గాలి వాన రావడంతో దుబ్బాక పట్టణం 16 వార్డులో పిట్టల వాడలోని ఏడు గుడిసెలు కూలిపోయాయి. రాత్రంగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ధర్మాజీపేటలో జనగామ చంద్రయ్య ఇంటిపై భారీ వేప చెట్టు కూకటి వేళ్లతో విరిగి పడడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న వారికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లో నిత్యావరసర సరకులు, టీవీ, తదితర వస్తువులు దెబ్బతిన్నాయని బాధితులు వాపోయారు. పక్కనే ఉన్న రాజవ్వ ఇల్లు సైతం పాక్షికంగా కూలింది. మరోవైపు చెట్లు విద్యుత్ వైర్లపై పడటంతో స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో పట్టణంలో అంధకారం నెలకొంది. విద్యుత్ అధికారులు శ్రమించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.