
అర్జీలు సత్వరం పరిష్కారం
● కలెక్టర్ మనుచౌదరి ● ప్రజావాణిలో 69 దరఖాస్తులు
సిద్దిపేట రూరల్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ మను చౌదరి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ సమస్యలపై మొత్తం 69 దరఖాస్తులు వచ్చాయి.
గుడి స్థలం ఆక్రమించారు
గుడి స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్‌కు చెందిన వెంకట్ స్వామి ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలోని వీర బ్రహ్మం దేవాలయానికి చెందిన భూమిని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్‌కు దారి కోసం కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
న్యాయం చేయాలి..
ఇంటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వారిపై చర్యలు చేపట్టి న్యాయం చేయాలని హుస్నాబాద్ పరిధి పోట్లపల్లికి చెందిన లచ్చవ్వ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తన ఇద్దరు కుమారులకు రావాల్సిన ఉమ్మడి ఆస్తిని తన పెద్ద కుమారుడు ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేసినట్టు ఫిర్యాదు లో పేర్కొన్నారు.