
దండిగా ధాన్యం
రికార్డు స్థాయిలో కొనుగోళ్లు
● సకాలంలోనే ఖాతాలో డబ్బులు
నంగునూరు(సిద్దిపేట): గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తుతోంది. గత సంవత్సరం కంటే ఎక్కువ ధాన్యం రావడంతో కొనుగోలు కేంద్రాలు కళకళ లాడుతున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నా ఆకస్మాత్తుగా వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం టార్పాలిన్ కవర్లు అందజేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నంగునూరు మండలంలో ఐకేపీ ద్వారా ఏడు, పాలమాకుల పీఏసీఎస్ నుంచి 12, నంగునూరు పీఏసీఎస్ ఆద్వర్యంలో నాలుగు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సన్న రకం వడ్లకు బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అన్ని గ్రామాల రైతులు ప్రస్తుత సీజన్‌లో దొడ్డు రకం వరితో పాటు సన్న వడ్లను సాగు చేశారు. వరి కోతలు ప్రారంభం కాగానే ఇప్పటి వరకు అన్ని సెంటర్లలో ఆశించిన స్థాయికి మించి ధాన్యం కొనుగోలు చేశారు.
23 సెంటర్ల ద్వారా ..
నెల రోజుల కిందట అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారుల ప్రారంభించారు. 23 సెంటర్ల ద్వారా ఇప్పటి వరకు 2,809 మంది రైతుల నుంచి 1,19,808 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. ఇందులో ఐకేపీ ద్వారా 1,130 మంది రైతుల నుంచి 41,630 క్వింటాళ్లు, పాలమాకుల పీఏసీఎస్ ద్వారా 1,127 మంది రైతుల నుంచి 54,238 క్వింటాళ్లు, నంగునూరు పీఏసీస్ ద్వారా 552 మంది రైతుల నుంచి 23,940 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. ఎప్పటికప్పడు ట్యాబ్‌లో ఎంట్రి చేసి వడ్లను మిల్లుకు తరలిస్తుండడంతో సకాలంలోనే తమ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయని రైతులు తెలిపారు.