
చేతికొచ్చింది
ఆయిల్‌పామ్..
సాగు అత్యంత లాభదాయకం
జిల్లా వ్యాప్తంగా 12,339 ఎకరాల్లో సాగు
● నర్మేట ఫ్యాక్టరీలో ప్రారంభమైన కొనుగోళ్లు
● లాభాలు గడిస్తున్న రైతులు
సిద్దిపేటరూరల్: ఆయిల్‌పామ్ సాగు అత్యంత లాభదాయకమని, సాగు వైపు రైతులను మళ్లించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. సాగు లక్ష్యం చేరుకునేలా సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో ఆయిల్‌ఫెడ్, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో గరిమా అగర్వాల్ సమావేశం నిర్వహించారు. ముందుగా ఉద్యానశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 12,339 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు అవుతుందన్నారు. 2025–26 సంవత్సరానికి గాను 6500 ఎకరాల లక్ష్యం పెట్టుకుని ఇప్పటివరకు 665 ఎకరాలు 188 మంది రైతులను గుర్తించామన్నారు. అలాగే 209 మంది రైతుల నుంచి ఉత్పత్తులను ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో ఉన్న ఫ్యాక్టరీకి పంపినట్లు తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. 6,500 ఎకరాల జిల్లా లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ అధికారులందరి సమన్వయంతో వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. అనంతరం ఉద్యానశాఖ జారీ చేసిన ఆయిల్‌పామ్ సాగు కరపత్రాన్ని అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఏఓ రాధిక, ఉద్యానశాఖ అధికారి సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.
నంగునూరు(సిద్దిపేట): అన్నదాతలకు ఆయిల్‌పామ్ సాగు వరంలా మారింది. నాలుగేళ్ల కిందట సాగు చేసిన ఆయిల్‌పామ్ పంట దిగుబడులు చేతికొస్తుండటంతో అన్నదాతలను లాభాల బాట పట్టిస్తోంది. ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో నర్మేటలో కొనుగోళ్లు ప్రారంభం కావడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నంగునూరు మండలం నర్మేటలో ప్రభుత్వం ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీ నెలకొల్పడంతో జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగింది. 2022లో 2,774 ఎకరాల్లో సాగు చేయగా 2025లో 12,339 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రంగనాయకసాగర్, ములుగు, ఎల్లాయిగూడ గ్రామాల్లో మూడు చోట్ల నర్సరీలను ఏర్పాటు చేసి సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉచితంగా డ్రిప్పును అందజేసింది.
కొనుగోళ్లు ప్రారంభం
మొదటి సంవత్సరం ఆయిల్‌పామ్ సాగు చేసిన మొక్కలు 2024లో మొదటి క్రాఫ్ చేతికి రావడంతో నర్మేటలో కొనుగోళ్లను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 21 మండలాల నుంచి ఇప్పటి వరకు 492.9 టన్నుల ఆయిల్‌పామ్ గింజలను సేకరించి అప్పరావుపేట, అశ్వరావ్‌పేట లోని ఆయిల్ కర్మాగారానికి తరలించారు. పంటను అమ్మిన మూడు రోజుల్లోనే రైతు ఖాతాలో డబ్బులు జమ కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలో క్వింటాలుకు రూ.1,330 ధర ఉండగా ప్రస్తుతం రూ. 2,100 మద్దతు ధర లభిస్తోంది.
రూ.4లక్షలు సంపాదించా
నాలుగేళ్ల కిందట ఆయిల్‌పామ్ సాగు చేశా. చెట్లు ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తోంది. ప్రతి 15 రోజులకోమారు గెలలను తెంపుతూ ఇప్పటి వరకు 13 సార్లు నర్మేటకు తరలించి రూ.4 లక్షలు సంపాదించా. అంతర పంటలు సాగు చేసి అధిక లాభాలు గడించవచ్చు.
– నాగేంద్రం, అక్కెనపల్లి రైతు
రైతులను ప్రోత్సహించాలి
ఆయిల్‌పామ్ సాగులక్ష్యం చేరుకోవాలి
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
ఆయిల్‌ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం

చేతికొచ్చింది

చేతికొచ్చింది