
త్వరలో మార్కెట్ కమిటీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారం
గజ్వేల్: నియోజకవర్గంలో కొత్తగా నియమించిన వంటిమామిడి, కొండపాక మార్కెట్ కమిటీల నూతన పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఈనెల 10లోపు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి కలిసి ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కొత్త పాలకవర్గాలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మెహన్, శ్రీనివాస్‌రెడ్డి, సాజిద్‌బేగ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రసవాల సంఖ్య పెంచాలి
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్
నంగునూరు(సిద్దిపేట): ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. అలాగే హైరిస్క్ గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులకు సూచించారు. గురువారం రాజగోపాల్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి పల్వన్ కుమార్‌తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆశా వర్కర్లు చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించడంతో పాటు క్షయ, లెప్రసీ, హైపర్ టెన్షన్, షుగర్ వంటి అసంక్రమిత వ్యాధులపై అవగాహన పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రేవతి, శ్రీనివాస్, పీఆర్‌ఓ ఆనంద్, నారాయణ్‌రావు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతల స్వీకరణ
గజ్వేల్‌రూరల్: గజ్వేల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎం.స్వాతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పాండరి, సభ్యులు కలిసి మంథని కోర్టు నుంచి గజ్వేల్‌కు బదిలీపై వచ్చిన జడ్జి స్వాతికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు నరేశ్‌చారి, కరుణాకర్, భాస్కర్, ప్రశాంత్, భాస్కర్, అంజలి తదితరులు పాల్గొన్నారు.
క్రీడల్లో రాణించాలి
హుస్నాబాద్: క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. వేసవి క్రీడా శిక్షణలో భాగంగా మినిస్టేడియంలో గురువారం కబడ్డీ, వాలీబాల్ శిక్షణ శిబిరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మాజీ ఎంపీపీ వెంకట్, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ శ్రీనివాస్, కోచ్‌లు కృష్ణ, రాకేష్, సీనియర్ క్రీడాకారులు హుస్సేన్, రాజు తదితరులు పాల్గొన్నారు.
నేడు బెజ్జంకిలో ఎమ్మెల్యే
ఆన్ వీల్స్ కార్యక్రమం
హాజరుకానున్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
బెజ్జంకి(సిద్దిపేట): ప్రజలకు మరింత చేరువై సమస్యలను పరిష్కరించేందుకు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వినూత్నంగా చేపట్టిన ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం శుక్రవారం బెజ్జంకి మండల కేంద్రానికి వస్తున్నట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనుచౌదరి, ఎమ్మెల్యే పాల్గొంటారని పేర్కొన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఎమ్మెల్యే చేపట్టిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

త్వరలో మార్కెట్ కమిటీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారం

త్వరలో మార్కెట్ కమిటీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారం