
బీఆర్‌ఎస్‌కు వత్తాసు పలుకుతారా?
మున్సిపల్ కమిషనర్‌పై కలెక్టరేట్ ఏవోకు ఫిర్యాదు
సిద్దిపేటరూరల్: సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ బీఆర్‌ఎస్ నాయకులకు వత్తాసు పలుకుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, కార్యాలయాన్ని బీఆర్‌ఎస్ కార్యాలయంగా మారుస్తున్నారని పలువురు కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ విషయంపై గురువారం కలెక్టరేట్ ఏఓకు ఫిర్యాదు చేసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ బుధవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే హాజరవుతున్న విషయం మున్సిపల్ కమిషనర్ తమకు తెలియజేయలేదన్నారు. సమావేశానికి విలేకరులను అనుమతించాలని కోరితే గత ప్రభుత్వ జీఓ ప్రకారం అనుమతి లేదని చెప్పిన కమిషనర్ ఎమ్మెల్యే వచ్చాక అనుమతించడం ఎంతవరకు సమంజసమన్నారు. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు సమస్యల పరిష్కారంపై ఇచ్చిన వినతులపై స్పందించడం లేదన్నారు. ప్రతిపక్ష మహిళా కౌన్సిలర్లు సమావేశంలో మాట్లాడుతుంటే దుర్భాషలాడుతూ మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ మెప్మా సాయికృష్ణ, రమ్య, ఇద్దరు సిబ్బందిని తిరిగి మళ్లీ విధుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. వారిపై తక్షణమే విచారణ చేపట్టి శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే పలు పనుల టౌన్‌ప్లానింగ్, శానిటేషన్, మిషన్ భగీరథ, గ్రీన్ సిద్దిపేట, యూజీడీ, ఇంజినీరింగ్, కోమటిచెరువు వంటి పనుల్లో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగాయన్నారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోకపోతే జిల్లా మంత్రి, ఇన్‌చార్జి మంత్రుల దృష్టికి తీసుకెళ్లి సీబీఐ విచారణ చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మిఆనంద్, బుచ్చిరెడ్డి, మహమ్మద్ రియాజ్, కవిత, రవితేజ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.