అధికారుల తీరు మారాలి | - | Sakshi
Sakshi News home page

అధికారుల తీరు మారాలి

May 1 2025 7:28 AM | Updated on May 1 2025 7:28 AM

అధికారుల తీరు మారాలి

అధికారుల తీరు మారాలి

విధుల్లో నిర్లక్ష్యం

వహిస్తే చర్యలు

రోజూ క్షేత్రస్థాయిలో పర్యటించాలి

తాగునీటి సమస్య రానివ్వొద్దు

స్వచ్ఛ సిద్దిపేటే లక్ష్యం కావాలి

మున్సిపల్‌ సమీక్షలో ఎమ్మెల్యే హరీశ్‌రావు

సిద్దిపేటజోన్‌: ‘మున్సిపాలిటీకి మీరే కీలకం.. వార్డు ఆఫీసర్‌ పనితీరు బాగుంటే వార్డు బాగుంటుంది. వార్డు బాగుంటే పట్టణం బాగుంటుంది’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. బుధవారం సాయంత్రం మున్సిపల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రగతి పనులపై అధికారులతో ఆరా తీశారు. ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను కౌన్సిల్‌ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రోజూ క్షేత్ర స్థాయిలో మున్సిపల్‌ చైర్మన్‌, కమిషనర్‌, కౌన్సిలర్లు పర్యటించాలని, చెత్త బండ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పన్నుల వసూలులో మున్సిపాలిటీ ఎప్పుడూ ముందు ఉండాలని సూచించారు. వార్డు అధికారులు ప్రతి పనిలో భాగస్వామ్యం కావాలన్నారు. వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద మంచి నీటి వాటర్‌ ట్యాంక్‌ ను ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు గుండా ఏర్పాటు చేసిన రింగ్‌ మెయిన్‌ పనులను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో ఉదయం, సాయంత్రం రెండు సమయాల్లో ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. పాత బస్టాండ్‌ నుంచి మెదక్‌ రోడ్డు, కరీంనగర్‌ రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌ పాత్‌ లైటింగ్‌ ప్రణాళికలు సిద్ధం చేయాలని హరీశ్‌రావు చెప్పారు. ఇందిరమ్మ కాలనీ, బీటీ రోడ్డు పనులు, లింగారెడ్డిపల్లి బ్రిడ్జి పనుల జాప్యంపై అరా తీశారు. మూడు రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. పట్టణంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. పట్టణంలో విద్యుత్‌, మున్సిపల్‌ సిబ్బంది ఇష్టానుసారంగా చెట్లను నరకడం సరికాదని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టణంలో చెత్త పేరుకుపోయిందని, బ్లాక్‌ స్పాట్స్‌ తొలగించాలని సూచించారు. దేశ స్థాయిలో సిద్దిపేట కు మంచి పేరు ఉందని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అనంతరం 32 వార్డుల అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి రోజు ఉదయం 5గంటల నుంచి ప్రతి వార్డు అధికారి చెత్త బండితో తిరగాలని సూచించారు. అంతకుముందు చైర్‌పర్సన్‌ మంజుల అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం జరిగింది. పలు సమస్యలను కౌన్సిల్‌ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఆశ్రిత్‌, వైస్‌ చైర్మన్‌ కనకరాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement