సోలార్‌! | - | Sakshi
Sakshi News home page

సోలార్‌!

Apr 14 2025 7:18 AM | Updated on Apr 14 2025 7:18 AM

సోలార

సోలార్‌!

విద్యుత్‌ చార్జీల మోతకు చెక్‌ ● సిద్దిపేటలో ప్రయోగాత్మకం వాటర్‌ పంపింగ్‌ కేంద్రాలే లక్ష్యంగా.. ప్లాంట్ల ఏర్పాటుకు సర్వే డీపీఆర్‌ రూపకల్పనలో అధికారులు ● 18న ఏజెన్సీ బృందం రాక

బల్దియాల్లో విద్యుత్‌ వినియోగ చార్జీల బిల్లు గుదిబండగా మారుతోంది. ప్రతి నెలా పెద్ద పద్దు కింద రూ.లక్షలు చెల్లించాల్సి వస్తోంది. విద్యుత్‌ వినియోగం అనివార్యంగా మారడంతో చార్జీల మోత నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం సౌరశక్తిపై దృష్టి సారించింది. జిల్లాలో స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. సర్వే ప్రక్రియ చేపట్టి డీపీఆర్‌ను సిద్ధం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 18న ఏజెన్సీ ప్రతినిధులు సిద్దిపేటలో సర్వే నిర్వహించనున్నట్లు సమాచారం.

సిద్దిపేటజోన్‌: జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీలోని ప్రజలకు తాగునీరు అందించే క్రమంలో పంప్‌ హౌస్‌, హై లెవల్‌ వాటర్‌, లో లెవల్‌ వాటర్‌ ట్యాంక్‌లు నిర్మించారు. అలాగే వీధి దీపాలు, ప్రధాన రహదారులపై వివిధ రకాల దీపాలు, కార్యాలయం నిర్వహణ నిమిత్తం ఇతర అవసరాలకు విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. ఈ లెక్కన పెద్ద ఎత్తున విద్యుత్‌ వినియోగం అవసరం కావడంతో దానికి అనుగుణంగా విద్యుత్‌ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది.

ప్రతీసారి కష్టంగానే..

బల్దియా చెల్లింపు ప్రక్రియలో విద్యుత్‌ చార్జీల అంశం ప్రతి నెల పెద్ద సమస్యగా మారుతోంది. గతంలో కొన్ని మున్సిపాలిటీలు సకాలంలో విద్యుత్‌ బిల్లులు చెల్లించక పోవడంతో సంబంధించిన శాఖ విద్యుత్‌ సరఫరాను తొలగించిన సంఘటనలు అనేకం. మున్సిపల్‌ ఆదాయ వనరులకు అనుగుణంగా చెల్లింపులు జరుగుతాయి. సిబ్బంది, కార్మికుల వేతనాల చెల్లింపులు చిన్నపాటి మున్సిపాలిటీల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితే. ఇలాంటి స్థితిలో విద్యుత్‌ చార్జీల అంశం పెద్ద సమస్యగా మారుతోంది. ఈ క్రమంలో సోలార్‌ ద్వారా అవసరమైన విద్యుత్‌ ఉత్పత్తితో కొంతమేరకు చార్జీల భారం తగ్గించే అవకాశం ఉందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

సిద్దిపేటలో ప్రయోగాత్మకం..

జిల్లాలో ఏకై క స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ సిద్దిపేటలో సోలార్‌ వ్యవస్థ ఏర్పాటు చేసి దాని ఫలితాల మేరకు జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో అమలుకు కసరత్తు చేస్తున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని సుమారు లక్షన్నర జనాభాకు అవసరమైన తాగునీరు సరఫరా కోసం పెద్ద ఎత్తున విద్యుత్‌ వాడకం చేస్తున్నట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. కరీంనగర్‌ జిల్లా నుంచి మానేరు నీటిని పంపింగ్‌ విధానం ద్వారా తరలించి ఆయా వార్డులకు సరఫరా చేస్తున్నారు. మరోవైపు మంగోల్‌ నుంచి మిషన్‌ భగీరథ నీటిని పంపింగ్‌ జరుగుతోంది. ఈ లెక్కన పట్టణంలో 63 నీటి ట్యాంక్‌లు, కమ్మర్లపల్లి, ఇల్లంతకుంట పంపింగ్‌ స్టేషన్లు, నీటి శుద్ధీకరణ ప్లాంట్లు, ఫిల్టర్‌ బెడ్స్‌ లాంటి వాటి వినియోగం కోసం పెద్ద ఎత్తున విద్యుత్‌ వినియోగిస్తున్నారు. కేవలం తాగునీటికి విద్యుత్‌ వాడకం కింద బల్దియా ప్రతి ఏటా రూ.5కోట్లు చెల్లించాల్సి వస్తోంది. వీధి దీపాలు, ఇతరత్రా అవసరాలకు కోసం ప్రతి నెలా సుమారు రూ.80లక్షల కరెంట్‌ బిల్లు వస్తుంది. దీనిని అధిగమించేందుకు జిల్లా కేంద్రంలో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కమిషనర్‌ ఆశ్రిత్‌ కుమార్‌ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఈనెల 18న ఏజెన్సీ ప్రతినిధులు సిద్దిపేట మున్సిపాలిటీలో సర్వే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

విద్యుత్‌ బిల్లులు ఇలా.. (రూ.లలో)

మున్సిపాలిటీ ఏడాదికి..

సిద్దిపేట 9.60కోట్లు

గజ్వేల్‌ 1.20 కోట్లు

దుబ్బాక 60లక్షలు

హుస్నాబాద్‌ 38లక్షలు

చేర్యాల 36లక్షలు

ప్రక్రియ వేగవంతం..

సిద్దిపేట మున్సిపాలిటీలో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే సర్వే, డీపీఆర్‌ ప్రక్రియ వేగవంతం చేసేలా అడుగులు వేస్తున్నారు. కమ్మర్లపల్లి, ఇల్లంతకుంటలోని పెద్ద పంప్‌ హౌస్‌ల వద్ద ఉన్న ఖాళీ స్థలాల్లో, అదేవిధంగా సిద్దిపేట నాసర్‌ పూర ఫిల్టర్‌ బెడ్‌, చింతల్‌ చెరువు, నర్సాపూర్‌ చెరువు ఎస్టీపీ ప్లాంట్‌లు, పట్టణంలోని 11 హై లెవల్‌ వాటర్‌,లో లెవల్‌ వాటర్‌, లో లెవల్‌ వాటర్‌ ట్యాంక్‌ ల వద్ద ఖాళీ స్థలాల్లో సోలార్‌ ప్లాంట్స్‌ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

జీరో పవర్‌ బిల్లే లక్ష్యం

సిద్దిపేట మున్సిపాలిటీలో ప్రతి నెల రూ.80లక్షల కరెంట్‌ బిల్లు చెల్లించాల్సి వస్తోంది. సోలార్‌ వ్యవస్థను ప్రయోగాత్మకంగా చేపట్టి జీరో పవర్‌ బిల్లు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ప్రస్తుతం డీపీఆర్‌ తయారీలో నిమగ్నమయ్యాం. సర్వే అనంతరం క్లారిటీ వస్తుంది. అవసరమైన విద్యుత్‌ను సోలార్‌ ద్వారా ఉత్పత్తి చేసే ఆలోచన ఉంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతాం.

–ఆశ్రిత్‌ కుమార్‌,

మున్సిపల్‌ కమిషనర్‌, సిద్దిపేట

సోలార్‌!1
1/4

సోలార్‌!

సోలార్‌!2
2/4

సోలార్‌!

సోలార్‌!3
3/4

సోలార్‌!

సోలార్‌!4
4/4

సోలార్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement