కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తొద్దు
● దొడ్డు, సన్నాలు వేర్వేరుగా లోడ్ చేయాలి
● కలెక్టర్ మనుచౌదరి
మద్దూరు(హుస్నాబాద్): కేంద్రాలకు తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేయాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను, నిర్వాహకులను ఆదేశించారు. గురువారం మద్దూరు మండలం నర్సాయిపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసే అవకాశం ఉందని టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు అధిక ప్రాధాన్యతనిస్తూ బోనస్ కూడా ప్రకటించిందన్నారు. అందువల్ల వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని మద్దతు ధరతో పాటు, బోనస్ సైతం పొందాలని రైతులకు తెలిపారు. సెంటర్ చుట్టుపక్కల హార్వెస్టింగ్ అవుతున్న వరిధాన్య వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సన్న, దొడ్డు రకం వరి ధాన్యాన్ని లోడ్ చేసేటప్పుడు వేరువేరుగా చేయాలని సూచించారు. మిల్లర్ల వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. తూకం లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని ఆదేశించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల ప్రాథమిక వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్‌డీఓ జయదేవ్ ఆర్య, ఎంపీడీఓ, సిబ్బంది, రైతులు తదితరులు ఉన్నారు.
వసతి గృహాల్లో
మెనూ తప్పనిసరి
● నాణ్యమైన భోజనం అందించాలి
● అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రభుత్వం ప్రకటించిన మెనూను విఽధిగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ వసతి గృహ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. వసతి గృహంలోని స్టోర్ రూం, వంటగదిని పరిశీలించారు. ఈ సందర్భంగా గరిమా అగర్వాల్ మాట్లాడుతూ మెనూలో ఉన్న మిల్లెట్ బిస్కెట్, నెయ్యి తప్పని సరిగా వినియోగించాలన్నారు. విద్యార్థినుల వ్యాయామానికి జిమ్ ఏర్పాటు చేయాలన్నారు. నల్లా కనెక్షన్, లైబ్రరీలో బుక్స్ కావాలని విద్యార్థులు కోరగా వెంటనే మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమశాఖ అధికారి హమీద్, వసతి గృహ సంక్షేమ అధికారి శ్వేత తదితరులు పాల్గొన్నారు.
కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తొద్దు


