మాతృస్ఫూర్తితో.. పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలు
విధులు నిర్వర్తిస్తూ.. కుటుంబాన్ని పోషిస్తూ.. ● అమ్మ జ్ఞాపకార్థం సేవాకార్యక్రమాలు
‘అమ్మ’ నడిచే దైవం అంటారు.. ఆమె అందించే ప్రేమ నిస్వార్థమైనది. తల్లి ప్రేమ తోడుంటే ఏదైనా సాధించవచ్చు. ఆ తల్లి అందించిన స్ఫూర్తితో ఉన్నత ఉద్యోగాలు సాధించి ఇటు కుటుంబాన్ని, అటు ఉద్యోగ బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తూ మహిళలు ముందుకెళ్తున్నారు. అభాగ్యుల పాలిట బాలసదనం ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు కొందరు. మరికొందరు అనాథలకు ఆశ్రయమిచ్చి విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. ఇంకొందరు అమ్మ జ్ఞాపకార్థం పలు సేవాకార్యక్రమాలు చేపడుతూ.. ఆదర్శంగా నిలుస్తుండటం విశేషం. అమ్మ అందించిన స్ఫూర్తితో వివిధ రంగాల్లో ముందుకెళ్తున్న వారిపై మాతృ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు.
విధి నిర్వహణలో మాతృ సేవలు
తల్లిపై ప్రేమతో సేవాకార్యక్రమాలు
గజ్వేల్‌రూరల్: అమ్మపై ఉన్న ప్రేమ వెలకట్టలేనిది. భౌతికంగా లేకపోయినా ఆమె జ్ఞాపకార్థం నిరుపేదలకు సేవ చేస్తూ ముందుకు సాగుతున్నాడు ఓ తనయుడు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌కు చెందిన మర్కంటి కనకయ్య తన తల్లి బాల్‌లక్ష్మీ జ్ఞాపకార్థం నాలుగేళ్ల క్రితం లక్ష్మీ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాడు. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వంద మందికిపైగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లను అందజేశాడు. గ్రామంలో క్రీడల్లో రాణించే నిరుపేద విద్యార్థులకు, వివాహం చేసుకొనే నిరుపేద వధువులకు ఆర్థిక సాయం అందిస్తూ భరోసానిస్తున్నాడు. అలాగే నిరుపేదలు ఎవరైనా చనిపోతే వారికి ఆర్థిక సాయం అందించి, మనోధైర్యాన్ని కల్పిస్తున్నాడు. అమ్మపై ప్రేమతోనే తాను ఇప్పటి వరకు 100 వరకు సేవా కార్యక్రమాలు చేపట్టానని, మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనకయ్య తెలిపాడు.
ఆశ్రమంలో మానసిక వికలాంగులకు అన్నం తినిపిస్తున్న సిస్టర్స్
శివ్వంపేట(నర్సాపూర్): అనాథలకు ఆశ్రయమిచ్చి వారిని అమ్మలా ఆరాధిస్తూ సేవలందిస్తున్నారు. మండల పరిధిలోని మగ్దుంపూర్‌లో 12 ఏళ్ల క్రితం ఫాదర్ సజీవ్ వర్గీస్ బేతాని అనాథాశ్రమాన్ని నెలకొల్పారు. ఇక్కడ సుమారు 45 మంది అనాథ, మానసిక వికలాంగులు ఆశ్రయం పొందుతున్నారు. వీరి ఆలనా పాలనా నిత్యం ఆశ్రమంలోని సిస్టర్స్ కార్నాల్, రీతా, మంజు, మిస్సెస్ గ్రేసీ చూస్తున్నారు. రక్త సంబంధీకులే పట్టించుకోని నేటి రోజుల్లో మానసిక వికలాంగులకు అన్ని విధాల సేవలందిస్తూ వారి మానసిక స్థితి మెరుగు పడేందుకు కృషి చేస్తున్నారు.
నిరుపేదలకు సాయం చేస్తున్న కనకయ్య


