పాతాళానికి గంగ | - | Sakshi
Sakshi News home page

పాతాళానికి గంగ

May 3 2026 10:16 AM | Updated on May 3 2026 10:16 AM

ఎండల తీవ్రతే కారణమంటున్నఅధికారులు గత నెలతో పోలిస్తే సంగారెడ్డి,చౌటకూర్‌ మండలాల్లో కాస్త పెరుగుదల ఇటీవల కురిసిన అకాల వర్షమే కారణం

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో భూగర్భ జల మట్టం పడిపోయింది. గత నెల మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో సగటున 1.30 మీటర్ల మేరకు నీటి మట్టం తగ్గింది. మార్చిలో జిల్లా సగటు నీటి మట్టం 10.60 మీటర్ల లోతులో ఉండగా, ఇప్పుడు 11.90 మీటర్ల లోతుకు పడిపోయింది. అత్యధికంగా సదాశివపేట మండలంలో 3.27 మీటర్లు పడిపోయినట్లు తేలింది. అలాగే పటాన్‌చెరు మండలంలో 2.74 మీటర్లు, రామచంద్రాపురం మండలంలో 2.46 మీటర్ల మేరకు నీటిమట్టం తగ్గినట్లు గుర్తించారు. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా, మారుమూల మండలం మనూరులో కూడా 2.21 మీటర్ల తగ్గుదల కనిపించింది. కోహీర్‌లో 1.95 మీటర్లు తగ్గాయి.

అధిక ఉష్ణోగ్రతలు నమోదు..

భూగర్భ జలాలు పడిపోవడానికి ప్రధానంగా ఎండల తీవ్రతే కారణమని భూగర్భ జలశాఖ అధికారులు పేర్కొంటున్నారు. నెల రోజులుగా జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా 44 సెల్సీయస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎండల తీవ్రతతో భూమి వేడెక్కి నీటిమట్టాలు పడిపోతున్నట్లు తేలింది. అయితే ఎండాకాలంలో భూగర్భ జలాలు పడిపోవడం సాధారణమేనని ఆశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే భూగర్భ జలాలను వృథా చేయవద్దని, ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా భూగర్భ జలాలను సంరక్షించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

రెండు మండలాల్లో పెరుగుదల..

జిల్లాలో ఏడు మండలాల్లో భూగర్భ జల మట్టం ప్రమాదకర స్థాయికి పడిపోయినట్లు అధికారులు గుర్తించారు. గతేడాదితో పోల్చితే ఈ మండలాల్లో అత్యధిక స్థాయిలో నీటిమట్టాలు తగ్గుతున్నట్లు తేలింది. గుమ్మడిదల, హత్నూర, కల్హేర్‌, కంగ్టి, నిజాంపేట, పటాన్‌చెరు, సంగారెడ్డి మండలాల్లో ప్రమాదకర స్థాయిలో నీటి మట్టాలు పడిపోయాయి. సంగారెడ్డి విషయానికి వస్తే గత నెల మార్చితో పోల్చితే 2.22 మీటర్లు పెరిగినప్పటికీ.. గతేడాది పోల్చితే భారీగా తగ్గడంతో ప్రమాదకరస్థాయి మండలాల జాబితాలోకి చేరింది. అలాగే తీవ్రంగా పడిపోయిన మండలాలు పది ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదకర స్థాయిలో పడిపోయిన ఈ ఏడు మండలాల కంటే ఈ పది మండలాలు కాస్త తక్కువ పడిపోయాయి. ఇందులో ఆందోల్‌, చౌటకూర్‌, జిన్నారం, కంది, కోహీర్‌, కొండాపూర్‌, మొగుడంపల్లి, న్యాల్‌కల్‌, రామచంద్రాపురం, సిర్గాపూర్‌లు మండలాలున్నాయి.

జిల్లాలో సగటున 1.30 మీటర్ల లోతుకు పడిపోయిన భూగర్భ జలాలు

జిల్లా వ్యాప్తంగా భూగర్భ నీటి మట్టం పడిపోతే సంగారెడ్డి, చౌటకూర్‌ మండలాల్లో మాత్రం కాస్త పెరగడం గమనార్హం. మార్చితో పోల్చితే ఏప్రిల్‌లో సంగారెడ్డి మండలంలో 2.22 మీటర్లు పెరిగాయి. మార్చిలో 18.85 మీటర్ల లోతులో ఉన్న నీటిమట్టం ఏప్రిల్‌కు వచ్చేసరికి 16.63 మీటర్లకు వచ్చాయి. చౌటకూర్‌లో 2.41 మీటర్ల మేరకు పైకి వచ్చాయి. చౌటకూర్‌లో మార్చిలో 14.63 మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం ఏప్రిల్‌ నాటికి 12.22 మీటర్లకు పెరిగింది. ఇంత ఎండాకాలంలోనూ ఈ రెండు మండలాల్లో నీటిమట్టం పెరగడానికి ప్రధానంగా ఇటీవల కురిసిన అకాల వర్షమే కారణమని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement