వంద పడకల ఆస్పత్రిలో ఒకే డాక్టరా?
జోగిపేట ఆస్పత్రి డాక్టర్ల పనితీరుపైమంత్రి దామోదర గరంగరం
విధులకు రాని వైద్యుల సస్పెన్షన్‌కు మంత్రి ఆదేశాలు
జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిఆకస్మిక తనిఖీ
జోగిపేట(అందోల్): ‘‘వంద పడకల ఆస్పత్రిలో ఒక్కరే డాక్టరా? విధులకు హాజరుకాని వైద్యులను సస్పెండ్ చేయా’’లని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. జోగిపేటలోని ఏరియా ఆస్పత్రిని మంత్రి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుల్లోకి వెళ్లి స్వయంగా అక్కడ అందుతున్న సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు విధులకు సరిగ్గా రావడంలేదని చెప్పడంతో ఆస్పత్రి నుంచే రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్‌కు ఫోన్ చేశారు. జోగిపేట ఆస్పత్రి ఇక మారదా? వెంటనే ఈ రోజు విధులకు హాజరుకాని డాక్టర్లను సస్పెండ్ చేయండని మంత్రి ఆదేశించారు. మంత్రి స్వయంగా సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి ఆస్పత్రిలో ఎంతమంది ఉన్నారు..? వారంతా ఎక్కడ అంటూ విధుల్లో ఉన్న డాక్టర్ సతీశ్‌గౌడ్‌ను ప్రశ్నించగా...ఆస్పత్రి సూపరింటెండెంట్ సెలవుల్లో ఉన్నారని చెప్పగా, ఆర్‌ఎంవో అశోక్ ఎక్కడున్నారని అడిగారు. ఆస్పత్రిలోని అవుట్, ఇన్ పేషంట్ వివరాలు, రక్తపరీక్షలు, ఇతరత్రా సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో మందుల కొరత ఏమైనా ఉందా? ఇంకా ఏమైనా సమస్యలున్నాయా? అని డాక్టర్‌ను అడగగా, అలాంటిదేమి లేదంటూ ఆయన బదులిచ్చారు.


