విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి
న్యాల్‌కల్(జహీరాబాద్): విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని ఖలీల్‌పూర్ గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధిత రైతు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రైతు పెద్ద గొల్ల రాజు ఎప్పటిలాగే తనకున్న 10 గేదెలను మేపేందుకు పొలానికి తీసుకెళ్లాడు. ఒక గేదె మేత మేస్తూ పక్కనే ఉన్న చిన్నపాటి మడుగులో నీటిని తాగేందుకు వెళ్లింది. నీరు తాగే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. గమనించిన రైతు మిగిలిన గేదెలను అటు వైపు వెళ్లకుండా అడ్డుకున్నాడు. విద్యుత్ స్తంభానికి గల సపోర్టు తీగ ద్వారా విద్యుత్ సరఫరా జరిగి గేదె మృతి చెందిందని తెలిపాడు. మృతి చెందిన గేదె విలువ 1.20లక్షలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.


