ప్రజాధనం వృథా
శిథిలావస్థకు చేరుకున్న డబుల్ బెడ్రూంలు
ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇంటిని అందించాలనే లక్ష్యంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కోట్లు పెట్టి నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిరుపయోగంగా ఉన్నాయి. సంగారెడ్డి మండలంలోని హనుమాన్ నగర్ గ్రామ శివారులో బీఆర్‌ఎస్ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమో? లేక అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ నిర్మాణ పనులు మధ్యలోనే వదిలేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాటిపై దృష్టి సారించకపోవడంతో లక్షల రూపాయల ప్రజాధనం వృథాగా పోతుంది. నిర్మించిన ఇళ్లకు మరమ్మతులు చేసి పూరి గుడిసెల్లో ఉంటున్న పేదవారికి ఇస్తే మేలు జరుగుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం, అధికారులు చొరవ చూపాలని మండలవాసులు కోరుతున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లను ఆర్భాటంగా నిర్మించిన అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయకుండా వాటి నిర్మాణాలను సైతం పూర్తి చేయకుండా అలాగే వదిలేశారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ గత ప్రభుత్వం చేపట్టిన ఆ ఇళ్ల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇల్లు లేని పేదవారు మాత్రం ఎప్పుడు ఇళ్లు ఇస్తారా అని కళ్లలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికై నా ఇళ్లకు మరమ్మతులు చేసి పంపిణీ చేయాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం
మరమ్మతులు చేసి
అందజేయాలి: లబ్ధిదారులు


