‘మీ డబ్బు.. మీ హక్కు’
క్లెయిమ్ చేసుకోని సొమ్మును తిరిగి పొందవచ్చు
మెదక్ కలెక్టరేట్: బ్యాంకులు, పోస్టాఫీసులు, ఇతర సంస్థల్లో ప్రజలు క్లెయిమ్ చేసుకోని వాటిని తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మీ డబ్బు – మీ హక్కు ’ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. జిల్లాలోని ఆయా బ్యాంకులు, పోస్టాఫీసులు, ఇన్సూరెన్స్ సంస్థల్లో మిగిలిపోయిన డబ్బులను సంబంధిత వారసులు పొందడానికి ప్రభుత్వం ఈనెల 23 న మెదక్ కలెక్టరేట్‌లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ శిబిరం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఏళ్ల తరబడి క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్స్, బీమా పాలసీలు తదితర ఆర్థిక ఆస్తులు యజమానులకు చేరేలా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల సొమ్ము ప్రజలకే చేరాలన్న ఉద్దేశంతో ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, పీఎఫ్‌ఆర్డీఏ వంటి జాతీయ స్థాయి సంస్థలు, బ్యాంకులు, బీమా కంపెనీలు ఉమ్మడిగా ఈ శిబిరాలను నిర్వహిస్తున్నాయి. శిబిరంలో ఆస్తులు క్లెయిమ్ విధానంపై మార్గ నిర్దేశం చేయనున్నారు. బ్యాంకుల్లో పదేళ్లకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఉన్న పౌరులు ఉద్గం వెబ్‌సైట్ ద్వారా సులభంగా వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లాలోని ఆయా బ్యాంకులు, ఇతర సంస్థల్లో మొత్తం రూ.20.61కోట్లు ఎవరి పొందలేని డబ్బులు ఉన్నట్లు లీడ్ మేనేజర్ బాపూజీ తెలిపారు. బ్యాంకుల్లో రూ.14కోట్లు , ఇతర సంస్థల్లో రూ.6.61 కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈనెల 23న మెదక్‌లో నిర్వహించే శిబిరాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్‌బీఐ రీజినల్ డైరెక్టర్ సౌత్‌హెడ్ ప్రత్యేక అధికారిగా రానున్నట్లు తెలిపారు.
23న ప్రత్యేక శిబిరం
జిల్లాలో రూ. 20.61 కోట్లు


