57 మందికి జరిమాన
పటాన్‌చెరు టౌన్ / సంగారెడ్డి క్రైమ్ / సిద్దిపేటకమాన్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనదారులకు కోర్టులు జరిమానా విధించాయి. వివరాలు ఇలా... శనివారం పటాన్‌చెరులో నిర్వహించిన డ్రంకెన్‌డ్రైవ్‌లో 20 మందిని పట్టుకున్నట్లు ట్రాఫిక్ సీఐ లాలూ నాయక్ తెలిపారు. ఆదివారం సంగారెడ్డి కోర్టులో హాజరుపర్చగా వారికి రూ.వెయ్యి చొప్పున జరిమాన విధించారు. అలాగే సంగారెడ్డిలో నిర్వహించిన తనిఖీల్లో 13 మందిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా రూ.వెయ్యి చొప్పున జరిమాన విధించినట్లు ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేటలో 24మందికి కోర్టు రూ.1,88,000 జరిమాన విధించిందని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెపారు.
అక్రమ మద్యం స్వాధీనం
హుస్నాబాద్‌రూరల్: అక్రమ మద్యాన్ని పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. మండలంలోని పొట్లపల్లిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు బండి మల్లేశం ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. సోదాల్లో రూ.6వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినా మళ్లీ అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ ఇద్దరికి రూ.లక్ష వరకు జరిమాన వేయాలని సిఫార్స్ చేసినట్లు చెప్పారు. గ్రామాల్లోని బెల్టు షాపుల్లో అక్రమంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మృతదేహం కోసం గాలింపు
హవేళిఘణాపూర్(మెదక్): ఔరంగాబాద్ చెరువులో ఓ వ్యక్తి పడి మృతి చెందాడన్న అనుమానంతో పోలీసులు ఆదివారం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామానికి చెందిన ఆడెపు బాబు(40) శుక్రవారం మేసీ్త్ర పని కోసం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు వెతకగా అతడు వేసుకున్న దుస్తులు, చెప్పులు చెరువు ఒడ్డున ఉన్నట్లు గుర్తించారు.దీంతో పోలీసులు చెరువులో గాలింపు చేయించినా ఆచూకీ లభించలేదు.


