కోమాలోకి వెళ్లాడని..
వైద్యుల నిర్లక్ష్యంతో
సంగారెడ్డి: వైద్యుల నిర్లక్ష్యం వల్లే పేషంట్ కోమాలోకి వెళ్లాడని ఆరోపిస్తూ అతడి తరపు కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... సదాశివపేట మండలం నాగ్సన్‌పల్లి గ్రామానికి చెందిన ప్రతాప్ గౌడ్ శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఏంఆర్‌ఐ స్కాన్, ఇతర స్కాన్లు చేయడానికి అతడు సరిగా సహకరించడం లేదని, అతనికి వైద్యులు సెడేషన్ ఇంజక్షన్ ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన కొద్దిసేపటికీ సదరు పేషెంట్ కోమాలోకి వెళ్లాడు. ఇదేమిటని రోగి బంధువులు డాక్టర్లను ప్రశ్నించగా.. 24 గంటల సమయం పడుతుందని చెప్పారు. ఆ లోపు అతడికి ఓసారి గుండె కొట్టుకోవడం ఆగినట్లు గమనించిన వైద్యులు వెంటనే సీపీఆర్ చేయగా మెలకువలోకి వచ్చాడు. అయితే వైద్యులు ఇచ్చిన ఇంజక్షన్‌తోనే తమ బంధువు కోమాలోకి వెళ్లారంటూ క్షతగాత్రుడి సంబంధీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం ప్రతాప్ గౌడ్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట
బంధువుల ఆందోళన


