ధైర్యంగా పని చేయండి
వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అన్ని పనులు చేసుకుందాం మా సర్పంచులను తన ఖాతాలో వేసుకుంటున్న సీఎం ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: బీఆర్‌ఎస్ సర్పంచులు ధైర్యంగా పనిచేయాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని చెప్పారు. బీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులను సంగారెడ్డిలో శనివారం ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా.. డబ్బులు పంచి గూండాయిజం చేసినా బీఆర్‌ఎస్ నాయకులు ధైర్యంగా ఎదుర్కొని సర్పంచులుగా విజయం సాధించారని చెప్పారు. మరో రెండేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమేనని, బీఆర్‌ఎస్ సర్పంచులు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. సర్పంచులు ఐదేళ్లు పదవిలో ఉంటారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక అన్ని గ్రామాల అభివృద్ధికి సంబంధించిన అన్ని పనులను తాను దగ్గరుండి చేయిస్తానని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు లేని చెక్ పవర్ సర్పంచులకే ఉంటుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పడైనా అధికార పార్టీ 90 శాతం స్థానాలను గెలుచుకుటుందని, కానీ ఈ సర్పంచ్ ఎన్నికల్లో 40 శాతానికి మించి సుమారు నాలుగు వేల సర్పంచ్ స్థానాలను బీఆర్‌ఎస్ గెలుచుకుందని హరీశ్ చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ సర్పంచులను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ సీఎం కావాలని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. సర్పంచులు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా సర్పంచుల ఖాతాల్లో జమ అవుతాయని పేర్కొన్నారు.
కొత్త సర్పంచులకు అవగాహన కార్యక్రమాలు
కొత్తగా సర్పంచులుగా ఎన్నికై న వారికి అవగాహన కల్పించేందుకు పార్టీ ఆధ్వర్యంలో త్వరలో సర్పంచులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రకటించారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి భవిష్యత్ ఉంటుందని, గెలిచిన వారికి బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఆ పార్టీ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, విజయేందర్‌రెడ్డి, డాక్టర్ శ్రీహరి, పట్నం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.


