మీ డబ్బు.. మీ హక్కు
ఆ ఆస్తులు నిజమైన ఖాతాదారులకే దక్కాలి: కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జోన్: జిల్లాలోని 17 బ్యాంకులలో 2,36,123 ఖాతాదారులకు సంబంధించి రూ.51.07 కోట్ల మేర క్లెయిమ్ చేయని ఆస్తులు ఉన్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు శనివారం కలెక్టరేట్‌లో క్లెయిమ్ చేయని ఆర్థికపరమైన ఆస్తులు నిజమైన ఖాతాదారులకే అందించడమే లక్ష్యంగా మీ డబ్బు–మీ హక్కు ప్రత్యేక జాతీయ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ మాధురితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు ఖాతాదారులకే చెల్లించాలని కోరారు. అక్టోబర్ నుంచి ఇప్పటివరకు సుమారు రెండు కోట్లు ఖాతాదారులకు చెల్లించినట్లు తెలిపారు. డిసెంబర్ 31 వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ నర్సింగ్ రావు, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జాతీయ రహదారి 65పై రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రేడియం స్టిక్కర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, ఆర్ అండ్ బీ ఈఈ రాంబాబు, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయ్ భాస్కర్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి విశాలాక్షి, డీటీఓ అరుణ, బీసీ సంక్షేమ అధికారి జగదీష్, తదితరులు పాల్గొన్నారు.


