‘పేట’కు మరో 500 ఇందిరమ్మ ఇళ్లు
● ఆర్థిక స్థోమత లేనివారికి రూ.లక్ష రుణం ● హౌసింగ్ డీఈ మాధవరెడ్డి
సదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట మున్సిపాలిటీకి మరో 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు హౌసింగ్ డీఈ మాధవరెడ్డి తెలిపారు. శనివారం మున్సిపల్ కమిషనర్ చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన నిరుపేద మహిళలకు ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద రూ 5లక్షల మంజూరు చేశామన్నారు. పట్టణంలో 150 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారని వారికి దశల వారీగా బిల్లులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు అందుకున్న వారు ఎందుకు నిర్మాణాలు ప్రారంభించలేదో తెలుసుకోవాలని ఆదేశించారు. ఆర్థిక స్థోమతలేని వారికి మెప్మా రూ లక్ష రుణం అందజేస్తుందని, ఈ లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. ఏప్రిల్‌లో మురికవాడల్లో నివాసం ఉంటు న్న వారికి ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకం అమలు చేస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషర్ శివాజీ, హౌసింగ్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు.


