అన్నా.. వచ్చి ఓటేయండి | - | Sakshi
Sakshi News home page

అన్నా.. వచ్చి ఓటేయండి

Dec 8 2025 10:39 AM | Updated on Dec 8 2025 10:39 AM

అన్నా.. వచ్చి ఓటేయండి

అన్నా.. వచ్చి ఓటేయండి

● ప్రయాణ ఖర్చులు చెల్లిస్తామని హామీలు! ● గెలుపోటములు ప్రభావితం చేసే అవకాశం ● వలసెళ్లినా.. గ్రామాల్లోనే ఓటు

వలస ఓటర్లకు అభ్యర్థుల పిలుపులు
● ప్రయాణ ఖర్చులు చెల్లిస్తామని హామీలు! ● గెలుపోటములు ప్రభావితం చేసే అవకాశం ● వలసెళ్లినా.. గ్రామాల్లోనే ఓటు

జోగిపేట(అందోల్‌): ఓటు వేయడానికి రావాలని, ప్రయాణం, మిగతా ఖర్చులన్నీ చెల్లిస్తామంటూ బరిలో నిలిచిన అభ్యర్థులు వలస ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ఊరు విడిచి ఇతర పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లి జీవించే వారి ఓట్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతుంటారు. అసెంబ్లీ, పార్లమెంట్‌, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా వలస ఓటర్లను తమ వైపు ఆకర్శించడం కోసం నయానా...బయానా ఇస్తుంటారు. ఒకరికంటే ఒకరు ఎత్తులకు పైఎత్తులు వేసి వారి ఓట్లను తమవైపు తిప్పుకునేలా చూస్తున్నారు.

కారులో వస్తారా? బస్సులో వస్తారా..

పంచాయతీ ఎన్నికల్లో తక్కువ ఓట్లతోనే జయాపజయాలుంటాయి గనుక వారిని ఏదో రకంగా ఓటు వేయించాలని కంకణం కట్టుకుంటున్నారు. ప్రతి గ్రామం నుంచి 50 నుంచి 100 మంది వరకు ఇతర ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకొని జీవిస్తున్నారు. ఒక్క రోజు పని పోయినా ఆ కూలీ డబ్బులను మేమే చెల్లిస్తామని, కారులో వస్తారా?బస్సులో వస్తారా? ప్రత్యేకంగా వాహనాన్ని మాట్లాడుకొని వస్తారా? అంటూ బేరసారాలు ఆడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. విచిత్రమేమిటంటే గ్రామంలోని ఓటర్ల కంటే ముందుగా వలస వెళ్లిన ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారని సమాచారం. ఒక్కొక్కరికి కొందరు రూ.500 ఇస్తే, మరికొందరు రూ.600 ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పంచాయతీల్లో అయితే రూ.వెయ్యి కూడా చెల్లిస్తున్నట్లు వినికిడి.

ఎక్కడున్నా.. ఓటు స్వగ్రామంలోనే..

బతుకుదెరువు కోసం కుటుంబాలతో సహా పటాన్‌చెరు , బొల్లారం, జగద్గిరిగుట్ట, రామచంద్రాపురం, ఇస్నాపూర్‌, బాలానగర్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఏళ్ల తరబడి స్థిరపడినా.. ఓట్లు మాత్రం ఇంకా గ్రామాల్లోనే ఉండటం విశేషం. ఇలా వేలాది మంది తమ పిల్లల చదువులు, ఉద్యోగరీత్యా, రియల్‌ ఎస్టేట్‌, ఇతర వ్యాపారాలు నిర్వహించుకుంటూ రాజధానిలో స్థిరపడ్డారు. అక్కడ ఉంటున్న వారు ప్రతీ ఎన్నికకు సొంత గ్రామానికొచ్చి ఓటు వేసి వెళ్తుంటారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతారు. కాగా పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటు ఎంతో విలువైనది కావడంతో వలస ఓటర్లకు డిమాండ్‌ పెరిగింది.

వలస ఓటర్లకు ఫోన్‌..

ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్థులు స్వయంగా వలస ఓటర్ల ఫోన్‌ నంబర్లు తీసుకొని ఫోన్‌ చేసి అభ్యర్థిస్తున్నారు. కాకుండా మా తరపున పలానా వ్యక్తి వచ్చి మిమ్మల్ని కలుస్తాడు..మీరంతా నాకే ఓటు వేయాలంటూ సూచిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో కూడా 90శాతానికి పైగా ఓటింగ్‌ శాతం నమోదవుతుంది. దీనికి కారణం వలస ఓటర్లకు ఖర్చులు ఇచ్చి పిలిపించుకోవడమే. లేకుంటే ఓటు వేయడానికి మేమెందుకు ఖర్చులు పెట్టుకుంటాం.. పోటీ చేసేటోడు ఖర్చులు భరిస్తే వెళతామంటూ భీష్మించుకు కూర్చున్న వారు కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement