వేతన వెతలు!
సంచార పశువైద్య సిబ్బంది అవస్థలు
● నాలుగు నెలలుగా అందని జీతాలు ● భారంగా మారిన కుటుంబ పోషణ
నారాయణఖేడ్: మూగజీవాలకు వైద్యం అందిస్తూ వాటి సేవల్లో తరిస్తున్న సంచార పశువైద్య సిబ్బంది వేతనాలు లేక పస్తులుంటున్నారు. వచ్చేదే అరకొర వేతనం.. అది కూడా నాలుగు నెలలుగా రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో నారాయణఖేడ్, ఆందోల్, పటాన్‌చెరు, సంగారెడ్డి, జహీరాబా ద్ నియోజకవర్గ కేంద్రాల్లో నియోజకవర్గానికి ఒక సంచార పశు వైద్యశాల వాహనం కొనసాగుతోంది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ తిరుగుతూ సిబ్బంది వైద్యం అందించాల్సి ఉంటుంది.
ఫోన్‌కాల్‌తో గ్రామానికి
సంచార పశు వైద్యశాల వాహనం 1962 నంబర్‌కు ఫోన్ రాగానే ఉరుకులు పరుగుల మీద ఆ గ్రామానికి వెళ్లి సదరు పశువులకు చికిత్స అందిస్తారు. ఒక్కో వాహనంలో పశు వైద్యుడు, సహాయకుడు, డ్రైవర్, హెల్పర్ విధులు నిర్వర్తిస్తుంటారు. వీరు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు తమ విధులను నిర్వర్తిస్తుంటారు. ఆయా గ్రామాల్లో పశువులకు ఏమైనా సమస్యలు వచ్చినా, వ్యాధులు సోకినా వీరికి ఫోన్ చేయగానే గ్రామానికి మందులతో వెళతారు. సదరు పశువుకు రైతుల ఇళ్ల వద్దే చికిత్స అందిస్తారు. గ్రామాల్లో ఉండే గేదెలు, ఆవులు, ఎడ్లు, మేకలు, గొర్రెలు, కుక్కలు, పిల్లులు ఇలా అన్నిరకాల జంతువులకు వీరు గ్రామాల్లోనే అత్యవసర చికిత్సలు అందజేస్తారు. డిస్టోకియా (పిండాలు తీయడం), పాముకాటు, పశువులు గడ్డి మందు సేవించినా, గాలికుంటు వ్యాధులకు చికిత్స చేస్తారు. వైద్యుడికి రూ. 35 వేలు, సహాయకుడికి రూ. 15 వేలు, డ్రైవర్‌కు రూ. 9,500, హెల్పర్‌కు రూ. 9 వేల చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. వాహనాల డీజిల్‌కు జీవీకే సంస్థ డబ్బులు చెల్లిస్తుండగా, వేతనాలు మాత్రం ప్రభుత్వం అందజేస్తుంది.


