ఇందిరమ్మ బిల్లుల్లో కోతలు
స్లాబ్ వేసిన ఇళ్లకు రూ. 3.40
లక్షలతో సరిపెడుతుండ్రు
రూ. 60 వేలు ఈజీఎస్ నుంచి చెల్లిస్తారంటున్న అధికారులు
జాబ్‌కార్డులు లేని, పట్టణ లబ్ధిదారుల విషయంలో అయోమయం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో అయోమయం నెలకొంది. స్లాబ్ వరకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు మొత్తం బిల్లు రూ. నాలుగు లక్షలు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. కానీ కేవలం రూ. 3.40 లక్షలు మాత్రమే జమవుతున్నాయి. మిగితా రూ. 60 వేలు పెండింగ్‌లో ఉంటున్నాయి. బేస్‌మేట్ వరకు పూర్తయిన ఇళ్ల లబ్ధిదారులకు మొదటి విడతలో రూ. లక్ష చెల్లించారు. రూఫ్ లేవల్ వరకు పూర్తి చేసిన వారికి రెండో విడతలో మరో రూ. లక్ష చెల్లించారు. స్లాబ్ వరకు వేసుకున్న వారికి మూడో విడతలో రూ. రెండు లక్షలు జమ చేయాలి. కానీ కేవలం రూ. 1.60 లక్షలతోనే సరిపెట్టారు. ఇళ్ల బిల్లుల్లో రూ. 60 వేల కోత విషయమై లబ్ధిదారులు అధికారులను సంప్రదిస్తే ఈ మొత్తాన్ని ఉపాధి హామీ పథకం కింద చెల్లిస్తామని చెబుతున్నారు. 90 రోజుల కూలీ కింద ఉపాధి హామీ నిధులు వస్తాయని, అలాగే మరుగుదొడ్డి కోసం రూ. 12 వేలు జమ చేస్తామని లబ్ధిదారులకు సముదాయిస్తున్నారు.
జాబ్‌కార్డులేని వారి పరిస్థితి?
ఇందిరమ్మ లబ్ధిదారుల్లో కొందరికి ఉపాధి హామీ జాబ్ కార్డులు లేవు. వీరికి ఏ విధంగా బిల్లులు చెల్లిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. కొత్త జాబ్ కార్డులు తీసుకుందామని అనుకున్నప్పటికీ.. ఇప్పట్లో జారీ చేయడం లేదు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు కాదు. కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే అమలవుతోంది. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారులకు మిగిలిన రూ. 60 వేలు ఏ పథకం నుంచి చెల్లిస్తారో తెలియడం లేదు. దీనిపై గృహ నిర్మాణ శాఖ అధికారులకు కూడా స్పష్టత లేకుండా పోయింది.
జిల్లాలో ఇళ్ల ప్రగతి ఇలా..
ఇందిరమ్మ పథకం కింద జిల్లాకు 14,563 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 6,703 మంది లబ్ధిదారులు ఇంకా ముగ్గు పోసుకోలేదు. 7,860 మంది ఇంటి నిర్మాణం ప్రారంభించారు. 5,802 మంది బేస్‌మేట్ వరకు నిర్మించుకున్నారు. మరో 2,708 ఇళ్లు రూఫ్ లేవల్ వరకు పూర్తయ్యాయి. 1,297 మంది లబ్ధిదారుల ఇళ్లు స్లాబ్ వరకు నిర్మాణం పూర్తయింది. ఇలా స్లాబ్ వరకు నిర్మాణం పూర్తయిన లబ్ధిదారుల ఖా తాల్లో రూ. నాలుగు లక్షలు జమ కావాల్సి ఉండగా, కేవలం రూ. 3.60 లక్షలు మా త్రమే జమ అవుతున్నాయి. ఈ విషయమై ‘సాక్షి’ హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ చలపతిని ఫోన్‌లో సంప్రదించగా ఆయన స్పందించలేదు.


