ఎక్కడి ‘డబ్లింగ్’ అక్కడే!
● 268 కిలో మీటర్ల మేర నిర్మాణానికిప్రతిపాదన ● పనులు ప్రారంభిస్తే ఏడాదిలోగా పూర్తయ్యే అవకాశం
వికారాబాద్ నుంచి జహీరాబాద్ మీదుగా మహారాష్ట్రలోని పర్లీ వరకు డబుల్ రైల్వేలైన్ నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదించి ఏడాది కావొస్తున్నా ఇప్పటికీ పనుల ప్రారంభంలో ఎలాంటి పురోగతి లేదు.
జహీరాబాద్: వికారాబాద్ నుంచి జహీరాబాద్ మీదుగా మహారాష్ట్రలోని పర్లీ వరకు డబ్లింగ్‌కు సంబంధించి ప్రాథమిక సర్వే గతంలోనే పూర్తయిన్పటికీ పనుల ప్రారంభంలో మాత్రం అడుగు ముందుకు కదల్లేదు. ఈ ప్రాజెక్టు విషయంలో రైల్వే శాఖ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో డబుల్ రైల్వే లైన్ నిర్మాణం ఆమోదానికే పరిమితమైంది. వాస్తవానికి ఆమోదించిన వెంటనే పనులు చేపట్టి ఉంటే ఇప్పటి వరకల్లా డబుల్ రైల్వేలైన్ పనులు పూర్తయి ఉండేవని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భూ సేకరణ సమస్యలేదు
వికారాబాద్ నుంచి పర్లీ మధ్య 268 కిలోమీటర్ల మధ్య దూరం ఉంది. ప్రస్తుతం సింగ్‌ల్ లైన్ మాత్రమే ఉంది. ఉన్న లైన్ పక్క నుంచి రెండోలైన్ నిర్మాణం పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు. డబుల్ రైల్వేలైన్ నిర్మాణం కోసం అవసరమైన భూమి అందుబాటులోనే ఉంది. భూ సేకరణ సమస్య లేనందున పనులు ప్రారంభిస్తే త్వరితగతిన పూర్తి చేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయం ఉంది. ఇప్పటికే రైల్వే గేట్ల వద్ద కాపాలాదారులు ఉండటంతో వాటిని యథావిధిగా ఉపయోగించుకోనున్నారు. ప్రస్తుతం వాగులపై ఉన్న బ్రిడ్జిల వద్ద కొత్తగా బ్రిడ్జిలను నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకవసరమైన మేర నిధులను కేటాయించేందుకు కేంద్రం సైతం గతంలోనే సుముఖతను వ్యక్తం చేసింది.
పనులు పూర్తయితే లెవెల్ క్రాసింగ్ కష్టాలు దూరం
డబుల్ రైల్వే లైన్ నిర్మాణం పూర్తి చేయడం ద్వారా రైళ్ల రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా ఉంటాయి. లెవెల్ క్రాసింగ్ కష్టాలు సైతం దూరమవుతాయి. ప్రస్తుతం సింగిల్ లైన్ ఉన్నందున ఎదురుగా వచ్చే రైలుకు దారి ఇచ్చేందుకుగాను మరో రైలును వెసులుబాటు ఉన్న రైల్వేస్టేషన్లలో నిలిపివేస్తున్నారు. దీంతో రైళ్లు సమయానుసారంగా నడవని పరిస్థితి తలెత్తుతోంది. సుమారు గంట నుంచి రెండు గంటల పాటు రైళ్లు గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకుంటున్నాయని ప్రయాణికులు పేర్కొంటున్నారు. డబుల్ లైన్ మూలంగా వికారాబాద్, మర్పల్లి, కోహీర్, జహీరాబాద్, మెటల్‌కుంట, బీదర్, బాల్కి, కమలానగర్, ఉద్గీర్, లాతూర్‌రోడ్డు, పర్లీ స్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్, షిర్డీ, నాందేడ్, పర్లీ, పూణె, కాకినాడ, విజయవాడ, తిరుపతి, మచిలీపట్నం ప్రాంతాలకు రైళ్లు నడుస్తున్నాయి. డబుల్ రైల్వేలైన్ నిర్మాణంతో సకాలంలో రైళ్లు గమ్యస్థానాలకు చేరుకుంటాయి.
పెరగనున్న రైళ్ల సంఖ్య
డబుల్ రైల్వే లైన్ నిర్మాణం పూర్తి చేస్తే రైళ్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రధాన నగరాలు అయిన ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చైన్నె లాంటి ప్రాంతాలకు రైళ్లను నడిపే సౌలభ్యం కలుగుతుంది. అంతేకాకుండా గూడ్స్ రైళ్ల సంఖ్య కూడా పెరగనుంది. ప్రస్తుతం 30 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. రైళ్ల సంఖ్య పెరగడం ద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన రైల్వే ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.


