రైతులకు ఇబ్బందులు కలిగించకండి
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: పత్తి కొనుగోళ్ల విషయంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా పత్తి పంటను కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. నాగల్‌గిద్ద మండలం పూసల్‌పాడ్ మోడ్ వద్ద ఉన్న విజయ కాటన్‌మిల్లులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా రైతులు పత్తి పంటను నష్టపోయారని తెలిపారు. పత్తి బాగా తడిసిందని, కొనుగోళ్ల సందర్భంగా పత్తిలో తేమ శాతం కొంత ఎక్కువ ఉన్నా ఇబ్బందులు కలిగించకుండా కొనుగోళ్లు చేయాలని సూచించారు. రైతులకు న్యాయం జరిగే విధంగా సీసీఐ అధికారులు యాజమాన్యాలు చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఖేడ్ మండలం తుర్కాపల్లిలోని రథసుధ, అనంతసాగర్‌లోని సంతోశ్ భవానీ పొదుపు సంఘాల సభ్యులు సత్యమ్మ, పట్లోళ్ల శశికళకు ఎన్‌ఆర్‌ఎల్‌ఎం నిధులనుంచి స్వయం ఉపాధి కోసం రూ.2 లక్షల చొప్పున మంజూరుకాగా చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఐకేపీ ఏపీఎం సాయిలు, సంతోశ్, మాజీ ఎంపీటీసీ దత్తుగౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, జగదీశ్, శివారెడ్డి పాల్గొన్నారు.


