రక్షణ చర్యలపై అవగాహన
ఎస్పీ పరితోశ్ పంకజ్
పటాన్‌చెరుటౌన్: పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చర్యలపై కార్మికులకు మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించినట్లు ఎస్పీ పరితోశ్ పంకజ్ వెల్లడించారు. గురువారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలోని అపియోరియా ఫార్మాపరిశ్రమలో జిల్లా పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, ఎన్‌డీఆర్‌ఎఫ్ (జాతీయ విపత్తు నిర్వహణ బృందం), శాఖల సమన్వయంతో ‘మాక్ డ్రిల్‘ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన తక్షణ చర్యలు, సిబ్బంది సురక్షితంగా బయటపడే మార్గాలు, బృందాల సమన్వయం వంటి అంశాలపై ఎన్‌డీఆర్‌ఎఫ్ ద్వారా మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ, ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక అధికారులు, పటాన్‌చెరు డీఎస్పీ ప్రభాకర్, ఎ.ఆర్ డీఎస్పీ నరేందర్, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.


