బిల్లులు రావనే భయం!
599 సీసీ రోడ్ల నిర్మాణానికిరూ.37.18 కోట్ల మంజూరు నిధులొచ్చి తొమ్మిది నెలలైనాషురువైంది 53 రోడ్లే ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం పనుల తీరిది
సీసీ రోడ్ల పనులు చేసేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : జహీరాబాద్ నియోజకవర్గానికి గ్రామీణ రోడ్ల నిర్మాణం (సీఆర్‌ఆర్) పథకం కింద ఐదు మండలాల పరిధిలోని ఎస్సీ కాలనీల్లో మొత్తం 111 చోట్ల సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.ఐదు కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు ఎస్సీ ఉప ప్రణాళిక కింద ఈ నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 28న జీవోనం.78ను జారీ చేసింది. ఈ నిధులు వచ్చి దాదాపు తొమ్మిది నెలలైనా ఒక్క సీసీ రోడ్డు పనులు కూడా ప్రారంభం కాలేదు.
నారాయణఖేడ్‌దీ ఇదే తీరు. ఈ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని ఎస్సీ కాలనీల్లో 174 సీసీ రోడ్లు నిర్మాణానికి రూ.8.70 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఇక్కడ కూడా ఒక్క రోడ్డు పనికి కూడా ఇంకా శ్రీకారమే చుట్టలేదు. దీంతో ఈ నిధులు తొమ్మిది నెలలుగా మూలుగుతున్నాయి.
ముందుకు రాని కాంట్రాక్టర్లు
సాధారణంగా సీసీ రోడ్ల నిర్మాణం అంటే కాంట్రాక్టర్లు ఎగిరి గంతేస్తారు. సీసీ పనులు చేస్తే కాంట్రాక్టర్లకు పెద్ద మొత్తంలో కలిసి వస్తుంది. లాభాలు భాగా ఉండటంతో ఈ పనులు చేసేందుకు ముందుకొస్తుంటారు. కానీ, ఇక్కడ పనులు చేసేందుకు ఒక్క కాంట్రాక్టరు కూడా ముందుకు రావడం లేదు. ఎందుకంటే బిల్లులు సకాలంలో రావనే భయం కాంట్రాక్టర్లకు పట్టుకుంది. రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టి బిల్లుల కోసం నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో ఈ పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టి పనులు చేస్తే బిల్లులు సంవత్సరాల తరబడి ఆగిపోతే వడ్డీలకు సరిపోవనే భయంతో ఒక్క కాంట్రాక్టరు ముందుకు రావడం లేదు. దీంతో ఈ నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ పనులు చేయలేని పరిస్థితి నెలకొంది.
ఎస్‌డీఎఫ్ పనుల బిల్లులూ రాలేదు
స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎస్‌డీఎఫ్) కింద జిల్లాలో పలు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. ఈ పనులను చోటామోటా నాయకులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సన్నిహిత అనుచరులు చేశారు. ఈ బిల్లులు కూడా తీవ్ర జాప్యం జరుగుతుండటంతో కాంట్రాక్టర్లతోపాటు, నాయకులు కూడా ఇప్పుడు ఈ సీఆర్‌ఆర్ పనులు చేసేందుకు సాహసించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
53 రోడ్ల పనులే ప్రారంభం..
సీఆర్‌ఆర్ పథకం కింద జిల్లాలోని ఐదు నియోజకవర్గాలతోపాటు, నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న హత్నూర మండలాలనికి కలిపి మొత్తం రూ.37.18 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో 599 సీసీ రోడ్లను నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈ పనులను చేపట్టింది. 599 సీసీ రోడ్ల పనులకు గాను ఇందులో ఇప్పటి వరకు కేవలం 53 రోడ్లు పనులే ప్రారంభమయ్యాయి. ఇంకా 546 పనులు ప్రారంభానికే నోచుకోలేదు. షురువైన 53 సీసీ రోడ్ల పనుల్లో 39 పనులు పూర్తి కాగా, మిగిలిన 14 సీసీ రోడ్ల పనులు ప్రస్తుతం కొనసాగుతున్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు.


