కేంద్రాలు సరే.. కొనుగోలు ఏదీ?
నిలిచిన ధాన్యం
హబ్సిపూర్‌లో కొనుగోలు కేంద్రంలో ధాన్యం
● కాంటాలు ప్రారంభించాలని రైతుల వేడుకోలు
● వర్షానికి కొట్టుకుపోతున్న పరిస్థితి
ప్రారంభించి వారం రోజులు..
దుబ్బాక మండలం, మున్సిపాలిటీ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వారం రోజులవుతుంది. ఇంత వరకు కొనుగోళ్లు చేపట్టలేదు. ఐకెపీ ఆధ్వర్యంలో–27సెంటర్లు, పీఏసీఎస్ ద్వారా–9సెంటర్లు, మెప్మా ద్వారా–6సెంటర్లు ప్రారంభించారు. ప్రారంభించి వారం రోజులవుతున్నా 6 సెంటర్లలో మాత్రమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. మిగతా సెంటర్లల్లో ఇంత వరకు కొనుగోలు చేపట్టలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని అన్నదాతలు కోరుతున్నారు.
రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో అన్నదాతలు పలు ఇబ్బందులు పడుతున్నారు. – దుబ్బాకరూరల్:
వర్షాలతో ఇబ్బందులు
వర్షాలు కురువడంతో రైతులు ఎక్కువ శాతం తమ వరి పొలాలను తడి ఆరకముందే హార్వెస్టర్ సహాయంతో కోస్తున్నారు. ఆ తరువాత ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరి ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు కన్నీంటి పర్యంతమయ్యారు. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే రైతు కళ్ల ముందే ధాన్యం కొట్టుకుపోవడంతో చేసేదేమీలేక కుమిలిపోతున్నారు.
కేంద్రాలు సరే.. కొనుగోలు ఏదీ?


