రైతులను ఇబ్బందులు పెట్టొద్దు
తొగుట(దుబ్బాక)/కొండపాక(గజ్వేల్)/గజ్వేల్‌రూరల్ / దౌల్తాబాద్ (దుబ్బాక): పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు. తొగుటలోని ఎల్లారెడ్డిపేట శ్రీ వేంకటేశ్వర కాటన్ ఇండస్ట్రీ, కొండపాక మండలంలో వెలికట్ట, దుద్దెడ, గజ్వేల్ పరిధిలోని పిడిచెడ్‌లో సాయిబాలాజీ కాటన్ మిల్, దౌల్తాబాద్ పరిధిలోని హైమద్‌నగర్ తిరుమల కాటన్‌మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటిని సోమవారం ఎమ్మెల్సీ యాదవరెడ్డి, డీసీసీబీ ఉమ్మడి జిల్లా చైర్మన్ దేవేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పత్తిని వ్యవసాయ బావుల వద్ద ఆరబెట్టుకుని తీసుకురావాలని సూచించారు. రైతులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించి కొనుగోలు సజావుగా సాగేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకువచ్చే రైతులకు మద్దతు ధర కల్పించాలని, తేమశాతం పేరుతో ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. రైతుల పట్ల మిల్లుల నిర్వాహకులు దళారుల మాదిరిగా వ్యవహరించవద్దని సూచించారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ యాదగిరి, రాష్ట్ర మార్కెటింగ్ డీడీ ప్రసాద్‌రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఎంపీ రఘునందన్‌రావు
పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం


