కొలువుదీరిన థీమ్ పార్క్
వర్గల్(గజ్వేల్): ప్రతిష్టాత్మక ఉమ్మడి మెదక్ జిల్లా పీఎంశ్రీ నవోదయ విద్యాలయ ప్రాంగణంలో ‘మేథమెటిక్స్ థీమ్ పార్క్’ కొలువుదీరింది. పచ్చని హరిత వృక్షాల మధ్య ఆహ్లాద వాతావరణంలో దాదాపు రూ. 1.5 లక్షలు పీఎంశ్రీ నిధులు వెచ్చించి గణిత సంబంధ 3డీ ఆకృతులతో దీనిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మధ్యలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ విగ్రహం ఏర్పాటు చేశారు. రూ. 50 వేలతో ఐలవ్ జేఎన్‌వీ సిద్దిపేట పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ రెండింటిని సోమవారం సాయంత్రం నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ అసిస్టెంట్ కమిషనర్ సాగరిక ప్రారంభించారు. ఈ సందర్భంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేందర్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.


