పత్తితీతలో మెలకువలు
పాటిస్తే నాణ్యతతోపాటు లాభం ● తేమ 8 నుంచి 9శాతం ఉంటే డిమాండ్
ఆరబెట్టే విధానం
పత్తిని సేకరించిన అనంతరం పరిశుభ్రంగా ఉండే టార్పాలిన్ కవర్లను గానీ, తాటిపత్రిపై గానీ, సీసీలపై గానీ తగినంత నీడలో ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పత్తిలోని గింజలు గట్టిపడి పత్తిలో తేమ శాతాన్ని తగ్గిస్తాయి. తేమ శాతం తగ్గడం వల్ల పత్తి పరిశుభ్రంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అనంతరం గోనె సంచుల్లో తొక్కిపెట్టి తేమ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పత్తిలో తేమ శాతం 8 నుంచి 9 శాతం ఉంటే మార్కెట్‌లో మంచి డిమాండ్ పలుకుతుంది.
మిరుదొడ్డి(దుబ్బాక): పత్తి సాగు ఏకవార్షిక పంట. పత్తిని తీసే తరుణం ఆసన్నమవుతోంది. పత్తి సాగులో పూత దపదపాలుగా వస్తుంది కాబట్టి పత్తిని ఒకటి రెండు సార్లు తీయాల్సి ఉంటుంది. ఈ దశలో నాణ్యమైన పత్తిని సేకరించడంలో రైతులు మెలకువలు పాటించాల్సిన అవసరం ఉందని మండల వ్యవసాయ అధికారి మల్లేశం చెబుతున్నారు. శీతాకాలం ప్రారంభం అవుతుండటంతో పత్తి సేకరణలో పలు అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. పత్తిని తీసే విధానంలో పూర్తి మెలకువలు పాటిస్తేనే నాణ్యమైన పత్తి లాభసాటిగా మారుతుందంటున్నారు. పత్తితీతలో చేపట్టే విధానంపై సలహాలు, సూచనలు.
పత్తి తీయడంలో మెలకువలు
పత్తితీత రెండు దపాలుగా తీయాల్సి ఉంటుంది. బాగా ఎండిన పత్తిని మాత్రమే గుల్లల నుంచి సేకరించాలి. పత్తిని తీసే క్రమంలో ఆకులు, తొడిమలు, కాడలు, చెత్తాచెదారం రాకుండా జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా పత్తితీత కార్యక్రమం చలికాలంలోనే ఎక్కువ తీయాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎక్కువ శాతం ఉదయం ఫూట మంచు కురుస్తుంది. దీంతో పత్తి పచ్చిగా, తేమ కలిగి ఉండటం, ముద్దగా మారుతుంది. అయితే పత్తి నాణ్యత తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పత్తిపై కురిసిన మంచు ఆవిరయ్యే వరకు పత్తిని తీయరాదు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు పత్తిని తీయించాలి.
పత్తితీతలో మెలకువలు


