
సీతాఫలం కోసం వెళ్లి..
అల్లాదుర్గం(మెదక్): ప్రమాదవశాత్తు బావిలో జారి పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మాందాపూర్ గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శంకర్ వివరాల ప్రకారం... మండల పరిధిలోని కోమటికుంట తండాకు చెందిన జయరాం (30) సీతాఫలం పండ్లు తీసుకురావడానికి ఆదివారం ఉదయం అటవీ ప్రాంతానికి వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అటవీ ప్రాంతంలో వెతికినా ఆచూకీ దొరకలేదు. సోమవారం ఉదయం మాందాపూర్ శివారులోని బావిలో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అనుమానాస్పద స్థితిలో..
ములుగు(గజ్వేల్): పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ములుగు మండల కేంద్రంలో జరిగింది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన డాకోజీ వెంకటాచారి(43) వడ్రంగి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతనికి భార్య వైష్ణవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే 20 రోజుల క్రితం భార్య పిల్లలతో కలిసి పుట్టింటికీ వెళ్లింది. ఆదివారం కట్టెల వ్యాపారానికి వెళుతున్నట్లు ఇంట్లో తల్లికి చెప్పి వెళ్లిన వెంకటాచారి రాత్రైనా ఇంటికి రాలేదు. సోమవారం ఉదయం ములుగులో గల అతిథి గృహం మెట్లపై వెంకటాచారి మృతి చెంది ఉన్నాడు. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు.
వరదలో కొట్టుకుపోయి వ్యక్తి..
రాయికోడ్(అందోల్): వరద నీటిలో కొట్టుకుపోయి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కుసునూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చైతన్య కిరణ్ కథనం మేరకు... గ్రామానికి చెందిన ఎం.కృష్ణ(44) ఆదివారం ఎక్సల్‌పై చిమ్నాపూర్‌కు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. గ్రామ సమీపంలోని గుర్మిళ వాగుపై ఉన్న వంతెనపై ఉన్న గుంతలను తప్పించే క్రమంలో అదుపుతప్పి వాగులోని వరద నీటిలో పడి కొట్టుకుపోయాడు. పోలీసులు, గ్రామస్తులు అతడి ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేదు. సోమవారం పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలించగా వందూరు మాడ వాగు వద్ద మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.
బావిలో జారిపడి వ్యక్తి మృతి

సీతాఫలం కోసం వెళ్లి..