
790 లైబ్రరీ పోస్టుల భర్తీ
నారాయణఖేడ్: రాష్ట్రంలోని గ్రంథాలయాల్లో ఖాళీగా ఉన్న 790 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.రియాజ్ అహ్మద్ తెలిపారు. ఖేడ్ శాఖ గ్రంథాలయానికి రూ.60లక్షలతో విస్తరణ పనులకు ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డిలతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గత 25 ఏళ్లుగా గ్రంథాలయాల్లో ఉద్యోగ నియామకాలను చేపట్టలేదన్నారు. ప్రజా ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తూ ఇప్పటికే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. కంగ్టిలో గ్రంథాలయ భవనం కోసం రూ.50 లక్షలు మంజూరు చేశామన్నారు. జహీరాబాద్‌లో గ్రంథాలయానికి రూ.54 లక్షలు మంజూరుచేసి దానికి కేటాయించిన స్థలంలో గత ప్రభుత్వం ఆసుపత్రిని నిర్మించిందన్నారు. ఎంపీ సురేశ్ షెట్కార్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే ఇక్కడ విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయన్నారు. ప్రతీ ఒక్కరూ రోజూ దినపత్రికలను చదవాలని, సైన్స్‌ను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. గ్రంథాలయంలో పుస్తకాల కోసం తనకోటాకు సంబంధించి రూ.5లక్షలు మంజూరు చేస్తానన్నారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ..త్వరలో నిర్వహించనున్న ఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాల సందర్భంగా నీట్ కోచింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తానన్నారు. నియోజకవర్గంలోని 15 పెద్దగ్రామాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్ అంజయ్య, కార్యదర్శి వసుంధర, ఆర్డీఓ అశోకచక్రవర్తి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, నాయకులు రమేశ్ చౌహాన్, వినోద్‌పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
సంస్థ చైర్మన్ రియాజ్ అహ్మద్ హామీ