దైవచింతనతో మానసిక ప్రశాంతత
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు టౌన్: దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని జగన్నాథ స్వామి దేవాలయంలో బుధవారం నిర్వహించిన విశ్వశాంతి మహాయజ్ఞం కార్యక్రమంలో ఆయన పాల్గొని, స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ...మినీ ఇండియాగా పేరొందిన పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పటాన్‌చెరు మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్‌గౌడ్ జగన్నాథ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు సన్మానించారు.
కేసీఆర్‌కు మద్దతుగా
బీఆర్‌ఎస్ శ్రేణులు
జహీరాబాద్ టౌన్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకల ఆరోపణలపై వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరవుతున్న మాజీ సీఎం కేసీఆర్‌కు మద్దతుగా బుధవారం ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. వాహనాల్లో బయల్లేరి వెళ్లిన వారు బీఆర్‌కే భవనం వద్ద ప్లకార్డులు పట్టుకుని కేసీఆర్‌కు మద్దుతుగా నినాదాలు చేశారు. హైదారాబాద్‌కు వెళ్లిన వారిలో బీఆర్‌ఎస్ నాయకులు రవికిరణ్, నారాయణ,పెంటారెడ్డి, సంజీవ్‌రెడ్డి, మశ్చేందర్, రామకృష్ణరెడ్డి ఉన్నారు.
పనిభద్రత కల్పించాలి
సీఐటీయూ నాయకుడు యాదగిరి
సంగారెడ్డి: మున్సిపల్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు పని భారం తగ్గించడంతోపాటు పనిభద్రత కల్పించాలని డిమాండ్ చేశా రు. హాజరు పేరుతో కాంట్రాక్ట్ కార్మికులను వేధిస్తున్న మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేయాలని సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి ఎం.యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదంలో రెండు చేతులు విరిగిన కాంట్రాక్ట్ కార్మికుడు మహేశ్‌ను సీఐటీయూ నాయకులు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ...కార్మికుడు ప్రమాదానికి గురయితే మానవత్వం చూపించాలి కానీదురుసుగా ప్రవర్తించకూడదన్నారు. మహేశ్‌ను వేధించిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
కిష్టారెడ్డిపేటలో కూల్చివేతలు
పటాన్‌చెరు: అమీన్‌పూర్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు కిష్టారెడ్డిపేటలో బుధ వారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈసందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారి పవన్ మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలకు సంబంధించి గతంలోనే నోటీసులు ఇచ్చామని, వాటికి స్పందించని వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జీ ప్లస్ టూ అనుమతులు తీసుకొని నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వారిని గుర్తించి నోటీసులు ఇచ్చామని, తమ సూచనలను పట్టించుకోకుండా అదనపు అంతస్తులు నిర్మిస్తే కూల్చివేశామని తెలిపారు.
దైవచింతనతో మానసిక ప్రశాంతత


