
పోచారం.. ‘వన విజ్ఞానం’
● అడవులు, జంతువుల గురించి అవగాహన ● విజ్ఞాన కేంద్రంలో యానిమల్స్ బొమ్మల ప్రదర్శన ● విద్యార్థులకు ఫీడ్‌బ్యాక్ వాల్ స్క్రీన్ ద్వారా చైతన్యం
హవేళిఘణాపూర్(మెదక్): అడవులు అంతరించిపోకుండా మొక్కలు పెంచి అడవుల శాతం పెంచాలని చెబుతున్న అధికారులు భవిష్యత్ తరాల విద్యార్థులకు ఉపయోగపడేలా వన విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ విజ్ఞాన కేంద్రంలో అడవిలో ఉండే జంతువులు దుప్పి, సింహం, ఎలుగుబంటి, జింకలు తదితర జంతువుల బొమ్మలను ప్రదర్శనకు ఉంచారు. మెదక్‌కు 14కిలోమీటర్ల దూరంలో ఉన్న హవేళిఘణాపూర్ మండలం పోచారం అభయారణ్యం పక్కనే ఈ వన విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నాలుగేళ్ల క్రితం యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఎస్‌ఐడీ) ఆధ్వర్యంలో రూ.56లక్షల వ్యయంతో 2021లో నిర్మించారు. ఈ కేంద్రం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చిన ఒక్కో విద్యార్థి సందర్శించేందుకు రూ.10 చెల్లిస్తే విజ్ఞాన కేంద్రంను చూపిస్తారు. అందులో ఒక హాల్‌లో టీవీని ఉంచి జంతువుల బొమ్మలు, వాటి ఆహారం, ఏయే రకాల జంతువులు ఉంటాయి. దాన్ని పరిరక్షించేందుకు మన బాధ్యతేమిటి? వన సంరక్షణ వల్ల కలిగే లాభాల గురించి టీవీల్లో చూపించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.
అటవీ సంపదపై అవగాహన
తల్లిద్రండులు, ఉపాధ్యాయులు విద్యార్థులను జూ పార్కులకు తీసుకెళ్లి చూపిస్తుంటారు. కానీ వాటి ఆహారం.. అవి ఏయే ప్రాంతాల్లో ఉంటాయి.. రకరకాల జంతువులు, పక్షులు, వేసవిలో వచ్చే పక్షుల గురించి కూడా ఈ ఫీడ్‌బ్యాక్ సెంటర్‌లో స్క్రీన్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. వేసవిలో తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకెళ్లి వన విజ్ఞాన కేంద్రంను సందర్శించవచ్చు.

పోచారం.. ‘వన విజ్ఞానం’