
సీనియర్ మేట్ల సమస్యలు పరిష్కరించండి
మెదక్ కలెక్టరేట్: సీనియర్ మేట్ల సేవలను గుర్తించి ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ల స్థానంలో నియమించాలని గ్రామీణ ఉపాధి హామీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలో సీనియర్ మేట్ల జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల్లో నియమించి, ప్రత్యేక అలవెన్స్ కింద నెలకు రూ.10వేలు వేతనం చెల్లించాలన్నారు. జిల్లాలో అమలవుతున్న ఉపాధి హామీని గ్రామాల్లో విజయవంతంగా అమలు చేసే దానిలో సీనియర్ మేట్ల పాత్ర కీలకమైందన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ కంటే సీనియర్ మేట్లు అనేక సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇన్ని పనులు చేస్తున్నా వారికి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదన్నారు. ఎండీఓ ఆఫీసులో ప్రత్యేక మీటింగ్‌లుంటే సొంత చార్జీలతో వెళ్లి వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని నమ్ముకొని చాలామంది సీనియర్ మేట్లు హరితహారం మొక్కలను సంరక్షించే పనిని ఉచితంగా చేస్తున్నారని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో కలిసిన గ్రామాలన్నింటికీ ప్రత్యేక ఉపాధి పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే.మల్లేశంతో పాటు సీనియర్ మేట్ల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ ఉపాధి హామీ సంఘం
రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్