
గ్రామ పాలన పరీక్షకు 250 మంది హాజరు
పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి జోన్: గ్రామ పాలన పరీక్షకు 250మంది అభ్యర్థులు హాజరు కాగా 15 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ తార డిగ్రీ కళాశాలలో గ్రామ పాలన అధికారి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అదనపు కలెక్టర్ మాధురితో కలసి ఆదివారం పరిశీలించారు. పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...గ్రామ పాలన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందన్నారు. కారక్యక్రమంలో ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కేతకీలో కోటి జపయజ్ఞం
ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకీ సంగమేశ్వరాలయంలో ఆలయ ఆవరణలో విశ్వ మానవ ధర్మ ప్రచారం పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం శివ మంత్ర కోటి జపయజ్ఞం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ఆవరణలో ‘దేశ రక్షణ–ధర్మ శిక్షణ’సంకల్పంతో యజ్ఞం, పూర్ణాహుతి, మహా మంగళ హారతి తదితర పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో దత్తగిరి మహరాజ్ ఆశ్రమ పీఠాధిపతి గిరి మహారాజ్, ధనసిరి పీఠాధిపతి వీరేశ్వర శివాచార్య మహాస్వామి, రంజోల్ రాజయోగ ఆశ్రమ పీఠాధిపతి రాజయ్య స్వామి, కేతకీ ఆలయ పాలకమండలి చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, ఆలయ ఈఓ శివ రుద్రప్ప, మాజీ చైర్మన్ నీల వెంకటేశం, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
గురుకుల కళాశాలలుఎత్తివేస్తే ఉద్యమమే!
ప్రభుత్వానికి కేవీపీఎస్ హెచ్చరిక
నారాయణఖేడ్: సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని జూనియర్ కళాశాలల ఎత్తివేస్తే భారీ ఎత్తున ఉద్యమిస్తామని, ఆ తర్వాత జరిగిన పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని జిల్లా కేవీపీఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఖేడ్‌లో ఆదివారం కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొఠారి నర్సింహులు, కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని 12 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఇంటర్మీడియెట్ కళాశాలలను ఎత్తివేతకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. దీంతో పేద, దళిత, బీసీ విద్యార్థులకు తీవ్రం నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘనాయకులు లాలప్ప, నాందేవ్, వినోద్ పాల్గొన్నారు.
సంగారెడ్డిలో 26 నుంచి
అంతర్జాతీయ సదస్సు
అమీర్‌పేట(హైదరాబాద్): యువతలో దేశ సాంప్రదాయ సంగీతం, సంస్కృతిని ప్రోత్సహించేందుకు సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అమంగిస్ట్ యూత్ (స్పిక్ మైకే)సంస్థ 10వ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. అమీర్‌పేట మ్యారీ గోల్డ్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు,పద్మశ్రీ డా.కిరణ్ సేట్ వివరాలను వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో ఈ నెల 26 నుంచి జూన్ 1వరకు ఏడు రోజులపాటు జరిగే సదస్సులో దేశ, విదేశాలకు చెందిన 1,400 మంది విద్యార్థులు,100 మంది వలంటీర్లు పాల్గొంటారని తెలిపారు. సంగీత విద్వాంసులతో పరిచయాలు, హస్తకళల సదస్సులు ఉంటాయన్నారు.

గ్రామ పాలన పరీక్షకు 250 మంది హాజరు