
అక్రమంగా వరి విత్తనాలు నిల్వ
అంకాపూర్ డీలర్‌పై కేసు నమోదు
నిజాంపేట(మెదక్): అక్రమంగా నిల్వ ఉంచిన మూడు టన్నుల వరి విత్తనాలను సోమవారం నిజాంపేట మండలానికి చెందిన వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకొని డీలర్‌పై కేసు నమోదు చేశారు. అధికారుల కథనం మేరకు.. మండలంలోని కల్వకుంటలో అక్రమంగా మూడు టన్నుల వరి విత్తనాలు నిల్వ ఉన్నట్లు సమాచారం అందింది. తనిఖీలు చేపట్టి సదరు విత్తనాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ విత్తనాలను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని రేయిన్ బో అగ్రిటెక్ డీలర్ వద్ద నుంచి సరఫరా అయినట్లు గుర్తించాం. విత్తనాలు స్వాధీనం చేసుకొని దుకాణానికి సీల్ చేశాం. సదరు డీలర్ మోహన్‌పై కేసు నమోదుకు జిల్లా అధికారులకు సిఫార్స్ చేసినట్లు వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి తెలిపారు. మండల పరిధిలో ఎవరైనా అనుమతులు లేని విత్తనాలు, క్రిమి సంహారక మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.