
అమ్మ ప్రేమే గొప్పది
కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్
పటాన్‌చెరు: సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదని, మనల్ని కనిపెంచిన మాతృమూర్తే మనకు కనిపించే దైవమని కాంగ్రెస్ నేత నీలం మధుముదిరాజ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని కండర క్షీణత వ్యాధి బాధితుల సంఘం వ్యవస్థాపకులు ఎం.రవికుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రామాలయం ఆవరణలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి నీలం మధు హాజరై మాట్లాడారు. జీవితంలో మరిచిపోలేని పాత్ర పోషించిన మన అమ్మకు ప్రత్యేకంగా గౌరవం ఇచ్చే రోజే అంతర్జాతీయ మాతృ దినోత్సవమన్నారు. అమ్మ ముఖంలో సంతోషం ఉండేలా చూసుకుంటే కొంతైనా అమ్మ రుణం తీరుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు మాతృమూర్తులను ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం పురస్కరించుకుని ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన నిర్వాహకులను అభినందించారు. కండరాల క్షీణత వ్యాధి బాధితుల సంఘానికి ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాతృమూర్తులు, దివ్యాంగులు, సంగారెడ్డి డీఆర్డీఏ ఏపీడీ జంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.