
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
పటాన్‌చెరు/రామచంద్రాపురం(పటాన్‌చెరు): అమీన్‌పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శనివారం అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని బంధం కొమ్ము కృష్ణ బృందావన్ కాలనీలో 20 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన నూతన రిజర్వాయర్‌ను, అలాగే.. ఉస్మాన్‌నగర్‌లో భగీరథ తాగునీటి రిజర్వాయర్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన కాలనీలకు సైతం తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ నేపథ్యంలోనే బంధంకొమ్ములో రూ.10 కోట్లతో ఎనిమిది కిలోమీటర్ల పైపులైన్ సామర్థ్యంతో 30 వేల మంది జనాభాకు మంచి నీటిన అందించేందుకు రిజర్వాయర్ నిర్మించామని చెప్పారు. అలాగే.. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రూ.30కోట్లతో రిజర్వాయర్‌ను నిర్మించామని, త్వరలో 55 కాలనీలకు సురక్షితమైన తాగునీటి అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ రెండు రిజర్వాయర్లను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, డీజీఎం చంద్రశేఖర్, తెల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్ పాల్గొన్నారు.
త్వరలో రెండు రిజర్వాయర్లు ప్రారంభం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి