
దుకాణాల సముదాయం.. ప్రారంభమే తరువాయి
రూ 10 కోట్ల వ్యయంతో నిర్మాణం
● డీసీఎంఎస్‌కు భారీగా ఆదాయం! ● వ్యాపారులకు ప్రయోజనం
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలో నిర్మించిన జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ పనులు పూర్తికాగా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రూ.10 కోట్లతో నిర్మించిన దుకాణ సముదాయం వల్ల సొసైటీకి ఆదాయం రానుండగా వ్యాపారులకు ప్రయోజనం కలగనుంది. పట్టణంలో డీసీఎంఎస్‌కు చెందిన 1.30 ఎకరాల స్థలం ఉంది. సుమారు ఆరు దశాబ్దాల క్రితం ఈ స్థలంలో రైస్‌మిల్, గోదాంలు నిర్మించారు. వాడకంలో లేక శిథిలమై పైకప్పు గోడలు, తలుపులు, కిటికీలు ఎక్కడిక్కడే దెబ్బతిన్నాయి. ఈ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ప్రయోజనం ఉంటుందని డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్ నిర్ణయించారు. శిథిలావస్థకు చేరిన కట్టడాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేయించారు. రూ. 10 కోట్లడీసీఎంఎస్ నిధులతో బహుళ అంతస్థుల్లో 84 దుకాణాలు, రైతు సేవా కేంద్రం, రైతు శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు. మూడు ఫ్లోర్‌లలో 120 దుకాణాలను నిర్మించాలని నిర్ణయించి మొదటి విడత 40 దుకాణాల పనులు ప్రారంభించారు. నిర్మాణం పనులు శరవేగంతో పూర్తి చేయించారు. దాదాపు పనులు పూర్తికాగా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
అద్దెకు దుకాణాల కేటాయింపు
వృథాగా ఉన్న డీసీఎంఎస్ స్థలంలో చేపట్టిన షాపింగ్ కాంప్లెన్స్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవం తరువాత అద్దెకు దుకాణాలను కేటాయిస్తాం. షాపింగ్ కాంప్లెక్స్ వినియోగంలోకి వస్తే సొసైటీకి ఆదాయం పెరుగుతుంది.
– ఎం.శివకుమార్,
డీసీఎంఎస్ చైర్మన్